CAG Report on Asara Pensions Distribution : బడుగు, బలహీన వర్గాల ప్రజలు, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన, సురక్షితమైన జీవితం గడిపేందుకు సామాజిక భద్రతలో భాగంగా గత ప్రభుత్వం 2014లో ఆసరా పింఛన్ల పథకాన్ని(Asara Pension Scheme) ప్రారంభించిందని కాగ్ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 మధ్యకాలంలో ఆసరా పథకం ఏ విధంగా అమలైందనే విషయాలను తెలుసుకోవడానికి కాగ్(CAG) ఆడిట్ నిర్వహించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు అందించిన రికార్డులను పరిశీలించిన తర్వాత పథకం అమలులో పలు అక్రమాలు, పర్యవేక్షణా లోపాలు ఉన్నట్లు గుర్తించింది.
సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకొని ఆసరా పింఛన్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ రెండింటిని పోల్చినప్పుడు 19శాతం కుటుంబాల వివరాలు అందుబాటులో లేవని తేలింది. పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి మంజూరు వరకు సరైన విధివిధానాలు పాటించలేదని కాగ్ గుర్తించింది. దరఖాస్తుదారులు అర్హులేనా కాదా అని తేల్చడానికి పెట్టిన నిబంధనలు తేల్చడానికి సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో ఉపయోగించలేదని తేల్చింది. లబ్ధిదారుల్లో అనర్హులున్నారనే విషయం గుర్తించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాగ్ అభ్యంతరం తెలిపింది. ఎంపిక చేసుకున్న జిల్లా నుంచి నాలుగు మండలాలను, రెండు పట్టణాలను ఎంచుకున్నారు. దరఖాస్తులు, లబ్ధిదారుల సర్వే నిర్వహించారని అలాగే లబ్ధిదారుల అర్హత, అనర్హత తేల్చడానికి ఇతర ప్రభుత్వ శాఖల డేటాను ఉపయోగించుకున్నారని కాగ్ తన నివేదికలో తెలిపింది.
2018 నుంచి 2021 వరకు మూడేళ్ల కాలానికి బడ్జెట్(Budget)లో రూ.27,188 కోట్లు కేటాయించారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.26,232 కోట్లు, కేంద్రం వాటా రూ.956 కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తంలో రూ.23,093 కోట్లను ఖర్చు చేశారు. మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల్లో ఉన్నప్పటికీ పూర్తిగా ఖర్చు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(Society for Elimination of Rural Poverty) లెక్క చూపినట్లు కాగ్ పరిశీలనలో తేలింది. ఆసరా లబ్ధిదారులుగా తేల్చడానికి పలు నిబంధనలు ఏర్పాటు చేశారు. కానీ చాలామందికి అర్హత లేకపోయినా లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు కాగ్ తనిఖీల్లో బయటపడింది. పథకం మార్గదర్శకాలకు విరుద్ధంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు కాగ్ గుర్తించింది. రిజిస్టర్లు కూడా సరిగ్గా నిర్వహించలేదని తేలింది.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పగుళ్లు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు
Asara Pension Scheme in Telangana : మూడేళ్ల వ్యవధిలో దాదాపు 3లక్షల మందికి రూ.1,768కోట్లు చెల్లించినట్లు కాగ్ నివేదికలో తేలింది. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు తేల్చింది. 20.36 లక్షల పింఛన్లు పరిశీలించగా 2914 కుటుంబాల నుంచి 3009 మంది అనర్హులైన లబ్ధిదారులకు రూ.14.83కోట్లు మంజూరు చేశారు. దివ్యాంగుల పింఛన్ కింద 5.83లక్షల మందిలో 11వేల లబ్ధిదారులకు పైగా సదరమ్ ఐడీ పొందుపర్చలేదు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళల ఎంపికలోనూ సరైన ప్రమాణాలు పాటించలేదని తేలింది. అనర్హులను తేల్చడానికి ఇతర ప్రభుత్వ శాఖల్లోని డేటాబేస్‌తో కాగ్ అధికారులు పరిశీలించారు.
రైతు బంధు డేటాతో పోల్చినప్పుడు 12152 మంది అనర్హులకు రూ.67కోట్లకు పైగా డబ్బులు జమ చేసినట్లు తేలింది. రైతుబీమా(Rythu Bhima)తో విశ్లేషించినప్పుడు చనిపోయిన 329మంది రైతుల పేరుమీద దాదాపు రూ.90లక్షలు చెల్లించినట్లు తేల్చారు. మెదక్ జిల్లాలోని చేగుంట మండలంలో చనిపోయిన వ్యక్తి పేరు మీద పంచాయతీ కార్యదర్శి 10నెలల వరకు పింఛన్ తీసుకున్నట్లు తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో లబ్ధిదారులకు తెలియకుండా పించన్లు తీసుకున్నట్లు కాగ్ నివేదికలో బయటపడింది. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలున్న వాళ్లకు ఆసరా చెల్లించొద్దని నిబంధనలు చెబుతున్నాయి.
2019లోనే కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేత : రవాణా శాఖ డేటాతో విశ్లేషించగా అందులో వేల మంది అనర్హులున్నట్లు బయటపడిందని కాగ్ నివేదికలో తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా వాళ్ల తల్లిదండ్రులు పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. 126మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.73లక్షలకు పైగా నగదు చెల్లించారు. 2019 చివరలో కొత్త పింఛన్ల మంజూరు నిలిపేసినట్లు ఆసరా డేటాబేస్ ద్వారా కాగ్ గుర్తించింది. కానీ 2020 సెప్టెంబర్‌లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో దాదాపు 37వేల మంది కొత్త పింఛనుదారులను చేర్చినట్లు కాగ్ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన 99వేల మంది ఆశావహులను కాదని వరుస క్రమం పాటించకుండా ఆ మూడు జిల్లాల వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తేల్చారు.
రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ప్రణాళికా సంఘాలు ఏర్పాటు కాలేదు : కాగ్
ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్ రిపోర్టు