CAG on Mallannasagar Reservoir : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన, అత్యధికంగా 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను లోతైన భూకంప ప్రభావ అధ్యయనం లేకుండానే నిర్మించినట్లు కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టింది. దీనికి దిగువనే 10.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపింది. రూ.6126.8 కోట్లతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌ను 2022 ఫిబ్రవరిలో ప్రారంభించారని చెప్పింది. అయితే ఇప్పటివరకు అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయలేదని పేర్కొంది. దీనివల్ల ఆనకట్ట తెగే సందర్భాలు ఎదురై స్పందించడంలో జాప్యం జరిగితే సమీపంలోని ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదం ఉంటుందని కాగ్ హెచ్చరించింది.
అంగీకారం రాకుండానే కాంట్రాక్టర్లకు పనులు : 2016లో ప్రాథమిక డ్రాయింగ్స్ ఇచ్చేటప్పుడు స్థాన నిర్దిష్ట భూకంప అధ్యయనాలను చేయించాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) నీటిపారుదల శాఖకు సూచించిందని కాగ్ తెలిపింది. ఆ ప్రకారం జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ)కు లేఖ రాసిన నీటిపారుదల శాఖ దాని అంగీకారం రాకుండానే కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టిందని కాగ్ ఆక్షేపించింది.
డ్రాయింగ్‌లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం
భూకంప తీవ్రత-6లో రిజర్వాయర్ : మరోవైపు 2018లో దీనిపై ఎన్‌జీఆర్‌ఐ ప్రాథమిక నివేదిక ఇచ్చిందని కాగ్ పేర్కొంది. తెలంగాణ భూకంప జోన్ -2లో ఉందని, గత మూడు, నాలుగు దశాబ్దాల్లో వచ్చిన భూకంప ప్రభావాలను ప్రస్తావిస్తూ భూకంప తీవ్రత-6లో మల్లన్నసాగర్ జలాశయం (Mallannasagar Reservoir) ఉందని తెలిపినట్లు వెల్లడించింది. భూకంప ప్రభావంపై లోతైన అధ్యయనం చేయాలని ఎన్‌జీఆర్‌ఐ సిఫార్సు చేసినా ఎక్కడా సమగ్ర సర్వే నిర్వహించకుండా జలాశయ నిర్మాణాన్ని కొనసాగించారని కాగ్ స్పష్టం చేసింది.
Mallannasagar in Earthquake Zone : అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అనుమతులు ఇస్తున్నట్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) పదేపదే పేర్కొందని కాగ్ (CAG)వివరించింది. డ్రాయింగులను కేంద్ర జల ఇంధన పరిశోధన సంస్థ, రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి సంస్థలతో పరిశీలింపచేయాలని సీడీవో చీఫ్ ఇంజినీర్ సూచించినా నిర్మాణానికి ముందు ఈ పని చేసిన దాఖలాలు లేవని కాగ్ పేర్కొంది.
మేడిగడ్డలో అడుగడుగునా లోపాలే - మంత్రి ఉత్తమ్‌కు విజిలెన్స్ ప్రాథమిక నివేదిక
95 శాతం పనుల తర్వాత నిపుణుల కమిటీ : అయితే 95 శాతం పనులను పూర్తి చేసిన తర్వాత రిజర్వాయర్ డిజైన్, ఇతర సాంకేతిక అంశాలపై 2021 జనవరిలో నిపుణుల కమిటీని నియమించారని కాగ్ తెలిపింది. భూకంప అధ్యయనాన్ని అత్యవసరంగా భావించి వెంటనే చేపట్టాలని జలాశయాన్ని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేసే ముందు అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కాగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పగుళ్లు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు
కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక