Budvel Assigned Lands Case Update : రెవెన్యూ, మున్సిపల్, హెచ్‌ఎండీఏ పత్రాలు పరిశీలించగా, మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానంద రెడ్డి పథకం ప్రకారం భూములు కొట్టేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బుద్వేల్‌లోని 26 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలు, సీసీఎస్‌లో నమోదైన 4 కేసుల దర్యాప్తులో వెల్లడైన అంశాలపై సీసీఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటన విడుదల చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో 281 ఎకరాల భూమిని ప్రభుత్వం 1994లో కొందరికి కేటాయించింది. అనంతరం భూములను స్వాధీనం చేసుకుంటూ ఆర్టీవో ఇచ్చిన ఆదేశాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ సమయంలో కేటాయించిన స్థలంలో అభివృద్ధి చేసి ప్లాట్లు ఇవ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉండగా, కొందరు కుట్రకు తెరతీశారు.
టీజే ప్రకాశ్, కోనేరు గాంధీ, దశరథ రామారావుతో పాటు మరికొందరు పట్టాదారుల్ని కలిసి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కరిస్తామని అధికారులు, రాజకీయ నాయకుల నుంచి ఇబ్బంది రాకుండా చూస్తామని నమ్మించారు. నిజమేనని భావించిన పట్టాదారులు 69 వేల 200 చదరపు గజాల స్థలంపై టీజే ప్రకాశ్, కోనేరు గాంధీ, దశరథ రామారావుతో కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చూపించి గూడూరు కృష్ణ, రవి రాంబాబు, రాఘవరావు వద్ద పెట్టుబడికి నగదు తీసుకున్నారు.
Ex IPS Shivanand Reddy Plans Assigned Land Occupation : అసైన్డ్ భూముల విక్రయాలు, హక్కుల బదలాయింపుపై నిషేధం ఉందని తెలిసినా భూములను రిజిస్టర్ చేయిస్తామని నమ్మించి ఆ డబ్బు తీసుకున్నారు. 2022లో మోసం చేసి పెట్టుబడి పేరిట డబ్బు వసూలు చేశారని గూడూరు కృష్ణ, రవిరాంబాబు, రాఘవరావు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా నాలుగు కేసులు నమోదు చేశారు. పాట్లు కేటాయించేలా చూడాలంటూ స్థానిక రియల్టర్ దయానంద్‌ను పట్టాదారులు సంప్రదించాగా శివానందరరెడ్డి జోక్యం మొదలైంది.
2008లో ఎస్పీగా రాజీనామా చేసిన మాండ్ర శివానందరెడ్డిని రియల్టర్ దయానంద్ ద్వారా టీజే ప్రకాశ్ కలిశారు. అప్పటికే స్థిరాస్తి, నిర్మాణరంగ వ్యాపారంలో ఉన్న శివానందరెడ్డి తన ప్రాజెక్టుల కోసం ఈ తరహా వివాదాస్పద భూములను డీల్ చేసేవారు. అసైన్డ్ పట్టాదారులతో మాట్లాడిన శివానందరెడ్డి తన పరపతితో ప్లాట్లు కేటాయించేలా చూస్తానని నమ్మించారు. చదరపు గజానికి రూ.12 వేల చొప్పున డబ్బు చెల్లించాడు. ఆ విధంగా కొందరికి రూ.5 మరికొందరికి రూ.10 లక్షల చెక్కులు ఇచ్చాడు.
Land Occupation: ప్రభుత్వ భూమి కబ్జా... అధికారులు ఏం చేశారంటే..
అనంతరం వివిధ స్థాయిలో శివానందరెడ్డి లాబీయింగ్‌తో రాజేంద్రనగర్ ఎమ్మార్వో పట్టాదారులతో పాటు ఆక్రమణదారులకు ప్లాట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 ఏప్రిల్, సెప్టెంబరు మధ్య ఆప్లాట్లను ఏ అండ్ యూ ఇన్‌ఫ్రాపార్క్, వెస్సెల్లా గ్రీన్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఆ సంస్థలు శివానందరెడ్డి భార్య ఉమాదేవి, కుమార్తె, కుమారుడివి కావడం గమనార్హం.
ఆ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా శివానందరెడ్డి 26 ఎకరాల అసైన్డు భూమి కొట్టేసేందుకు కుట్రపన్నారని, తన కంపెనీల పేరిట భూములు కొనుగోలు చేశారని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఒక మెమో ద్వారా అసైన్డు భూముల స్వభావాన్ని మార్చారని తేలింది. ఆ మొత్తం కుట్రలో మరికొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించామని పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని డీసీపీ వివరించారు.