KTR Comments On Loan waiver : రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, అధికార పార్టీ నాయకులు మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి పోస్టర్ల వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా రుణమాఫీపై మరోమారు స్పందించారు.
రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని, నిలదీస్తే బెదిరిస్తున్నారని, అయినా తగ్గేది లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రుణం తీరలే! రైతు బతుకు మారలే! అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క ప్రకారం రుణమాఫీ మొత్తం రూ.49,500 కోట్లు అయితే, కేబినెట్ భేటీలో చెప్పింది రూ.31 వేల కోట్లు అని పేర్కొన్నారు. అందుకోసం బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించి, మూడు విడతల వారీగా కలిపి ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమేనని వివరించారు.
రుణం తీరలే... ! రైతు బతుకు మారలే.. !
— KTR (@KTRBRS) August 17, 2024
✳️ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క రూ. 49,500 కోట్లు
✳️ కేబినెట్ భేటీలో చెప్పింది రూ. 31 వేల కోట్లు
✳️ బడ్జెట్లో కేటాయించింది రూ. 26 వేల కోట్లు
❌ 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది రూ. 17933 కోట్లు
ఒకే విడతలో రెండు లక్షల… pic.twitter.com/4QXmif3mE2
ప్రశ్నిస్తే దాడులా? : ఒకే విడతలో రూ.2 లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే బెదిరింపులు అని కేటీఆర్ తెలిపారు. అయినా తగ్గేదే లేదన్న ఆయన, నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని అన్నారు. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటామని కేటీఆర్ తెలిపారు. రుణమాఫీపై పత్రికా కథనాలను కూడా కేటీఆర్ తన ట్వీట్లో జతపరిచారు.
సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు : మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారంటూ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. కాగా ఆ ఫ్లెక్సీలను పోలీసులు శనివారం తెల్లవారుజామున తొలగించారు. 'చెప్పింది కొండంత - చేసింది రవ్వంత' అని పోస్టర్లపై రాసి ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే రుణమాఫీ నిధులను విడుదల చేశారు. రుణమాఫీ చేసి తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందున హరీశ్‌రావు తన పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు హరీశ్‌రావు రాజీనామా చేయాలని పలుచోట్ల పోస్టర్లు కూడా కనిపించడం కలకలం రేపింది.