BRS Telangana Formation Day Celebrations 2024 : స్వరాష్ట్రం సిద్ధించి పదేళ్లయిన సందర్భంగా బీఆర్ఎస్ మూడురోజుల పాటు వేడుకలు నిర్వహిస్తోంది. తెలంగాణను సాధించి తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ద కాలంపాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఈ వేడుకల్లో చాటిచెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇవాళ గులాబీ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన సభ నిర్వహిస్తారు. నగరంలోని పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు.
జూన్ 3న అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో దశాబ్ది ముగింపు వేడుకల్లో భాగంగా జాతీయ జెండా, పార్టీ జెండా ఎగురవేసి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలిరోజు వేడుకల్లో భాగంగా అమరజ్యోతుల ర్యాలీ పేరిట హైదరాబాద్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్‌పై ఉన్న అమరుల స్మృతిచిహ్నం వరకు ర్యాలీ సాగింది. తొలుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది సంబురం - అమరులకు నివాళులతో ప్రారంభం - TELANGANA FORMATION DAY 2024
బీఆర్ఎస్ అమరజ్యోతుల ర్యాలీ : అమరులకు అంజలి ఘటించి కొవ్వొత్తులతో స్మరించుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి రవీంద్రభారతి మీదుగా అమరజ్యోతుల ర్యాలీ సాగింది. పలువురు కళాకారులు తమ ప్రదర్శనలతో అదరగొట్టారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు అమరులకు అంజలి ఘటిస్తూ స్మృతి గీతాలు పాడారు.
తెలంగాణ సమాజ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అందించిన నిజమైన ప్రజాసంక్షేమ పాలన స్ఫూర్తి అందుకొని ముందుకు సాగడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ట పరుచుకుంటూ సమర్థంగా పాలన అందించిన పదేళ్ల స్వయంపాలనకాలం దేశానికి అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్‌గా నిలిపిందని కేసీఆర్ వివరించారు. ప్రజా భాగస్వామంతో సాధించిన ప్రగతిని, ప్రజా సంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఆహ్వానించినట్లే ఆహ్వానించి అవమానించదలిచారు - కేసీఆర్ బహిరంగ లేఖ - KCR letters to CM Revanth