Harish Rao Responded to Stray Dog Attacks : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరుగుపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎందరో పసికందుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
శుక్రవారం ఒక్కరోజే.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి ఘటనలు జరిగాయని హరీశ్ రావు తెలిపారు. అంతకముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన హృదయవిధారక ఘటనలు జరగటాన్ని చూసి కూడా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
వీధికుక్కల స్వైరవిహారం - బాలుడి పురుషాంగంపై దాడి
8 నెలల కాలంలో 343 కుక్కకాటు ఘటనలు జరిగాయి : బతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని, చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి దుయ్యబట్టారు. కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గత ఎనిమిది నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు.
సరైన నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే వ్యవస్థ కూడా అసలు సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. దీనివల్ల వీధి కుక్కల సంతానం విపరీతంగా పెరిగిపోయిందని వివరించారు. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినా సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వీడటంలేదని నిందించారు. ప్రభుత్వం వెంటనే కుక్కకాటు దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు కోరారు.
Stray dog attacks in Telangana : ఇప్పటివరకు జరిగిన కుక్కకాటు సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కుక్కకాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలన్నారు. యాంటీ రేబిస్ మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. వీధి కుక్కల నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని, క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ సంఖ్య పెరగకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.