BRS Wins Mahabubnagar MLC Elections 2024 : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. 109 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ్యునిగా ఎన్నిక కాగా, ఆయన రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. మార్చి 28న పోలింగ్ జరగ్గా, 1439 ఓటర్లకు గానూ 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ ఓట్లను ఇవాళ మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రంలో లెక్కించారు. పోలైన ఓట్లను సరిచూసుకుని చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేశారు. 21 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. చెల్లుబాటైన 1416 ఓట్ల ఆధారంగా 709 ఓట్లను కోటాగా గుర్తించారు. అనంతరం మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించారు. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్ధి నవీన్‌కుమార్ రెడ్డి 709 కంటే అధికంగా 762 ఓట్లు సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 653 ఓట్లు వచ్చాయి.
స్వతంత్ర అభ్యర్థికి ఒకటే మొదటి ప్రాధాన్య ఓటు దక్కింది. కోటా కంటే అధికంగా ఓట్లు రావడంతో నవీన్‌కుమార్ రెడ్డిని విజేతగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాన్ని అమరులకు అంకితిస్తున్నట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 2009లో టీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చినా, మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కేసీఆర్‌ను గెలిపించి దిల్లీకి పంపారని, 2023 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా ఎమ్మెల్సీని గెలిపించారన్నారు.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో కాంగ్రెస్ పోటీ చేయలేదని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆధిక్యం లేకపోయినా, కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దింపారన్నారు. రేవంత్ అనైతిక చర్యలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తిరస్కరించారన్నారు. సొంత జిల్లా, పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్‌కు ఈ ఫలితం చెంపపెట్టు అన్నారు. ఇప్పటికైనా రేవంత్ తీరు మార్చుకోవాలని సూచించారు.
శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకు గాను 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఈ నిరుత్సాహంలో ఉన్న పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం, నూతనోత్సాహాన్ని నింపింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు బీఆర్ఎస్‌కు సానుకూల ఫలితం వెలువడటం, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితం రావడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం - నవీన్ రెడ్డికి హరీశ్ రావు అభినందనలు