BRS MLA Kale Yadaiah joined Congress : బీఆర్ఎస్కు షాక్‌లు మీద షాక్‌లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు రోజు రోజుకీ జోరందుకుంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దీంతో ఇప్పటివరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్‌కు ఇప్పటివరకు ఉన్న 65 సభ్యుల బలం సీపీఐతో కలిపి 66కు చేరుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు చేరడంతో 72కి సభ్యుల బలం పెరిగింది. దీంతో శాసనసభలో బీఆర్ఎస్కు 32 మంది, బీజేపీకి 8 మంది, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : ముందుగా ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు నెలల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో సీనియర్ నేత స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, వరంగల్ ఎంపీగా తన కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు.
ఇప్పుడు వారం రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. పోచారం జాయిన్ అయిన రెండు రోజుల గ్యాప్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ బలం 32మందికి చేరుకుంది. ఇంకా మరింత మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సమాచారం.
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్