BRS MLA Harish Tweet On Revanth Reddy Comments: తనకు ఎవరి భిక్ష వల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి రాలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2005 జులై నాలుగో తేదీన మంత్రి పదవులకు రాజీనామా చేసిన సమయంలో మీడియాతో మాట్లాడిన వీడియోలను జతపరిచారు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరామని పదవుల కోసం కాదని పేర్కొన్నారు.
తనకు మంత్రిపదవి వచ్చినపుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నారని, ఆ ఊరేగింపులోనూ పాల్గొన్నారని హరీశ్ రావు గుర్తుకు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా తన వెనకే ఉండి నిక్కినిక్కి చూశారని అన్నారు. ఇదంతా కళ్ల ముందు జరిగిందే కానీ, ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు.
పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించిన ఆయన తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర తమదని అన్నారు. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర, పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదని ఆక్షేపించారు. చీఫ్ మినిస్టర్‌గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 1, 2024
శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు.
నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని… pic.twitter.com/uiU6hqDSPi
"నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాం తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు నీవు (సీఎం రేవంత్ రెడ్డి) టీఆర్ఎస్లోనే ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావని హరీశ్ రావు" ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలి : హరీశ్‌రావు - Harish Rao Reaction on CM Comments