BRS MLA Harish Rao React on Telangana Budget : రైతులకు ఎన్నికల హామీల్లో చాంతాడంత చెప్పారు కానీ బడ్జెట్లో మాత్రం రైతులకు చెంచాడంత పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బడ్జెట్(Telangana Budget)లో వ్యవసాయానికి కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఇంత తక్కువ మొత్తంలో కేటాయించడం వల్ల పంటల బీమా, పంటల బోనస్, రైతు భరోసా(Rythu Barosha)కు నిధులు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మరికొంత మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
డిసెంబరు 9వ తేదీనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని నాటి విషయాలను హరీశ్ రావు(Harish Rao) గుర్తు చేశారు. ఈ రూ.2 లక్షల రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవసరమని అన్నారు. కనీసం ఈ బడ్జెట్లో రుణమాఫీకి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. పంటల బోనస్‌కు రూ.15 వేల కోట్లు అవసరం, కానీ బడ్జెట్లో రూపాయి కూడా పెట్టలేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.82 వేల కోట్లు అవసరమవుతాయని స్పష్టం చేశారు. కానీ బడ్జెట్ పద్దును చూస్తే కేవలం రూ.16 వేల కోట్లతో సరిపెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.
గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉంది - ప్రభుత్వం తన విజన్‌ను ఆవిష్కరించలేదు : హరీశ్‌రావు
Harish Rao Comments on Budget : ఇవాళ రైతులకు 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సవాల్ విసిరారు. మొదటి అసెంబ్లీ సమావేశంలో ఆరు గ్యారంటీల(Congress Six Guarantees)పై చట్టం చేస్తామన్నారు. రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగాయని, ఆరు గ్యారంటీలపై చట్టం చేయలేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
"ఇళ్ల నిర్మాణానికి రూ.23 వేల కోట్లు అవసరం అవుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు బడ్డెట్లో మాత్రం రూ.7,700 కోట్లు పెట్టారు. నిరుద్యోగ భృతి ప్రస్తావన బడ్జెట్లో లేదు. మహాలక్ష్మీ పథకానికి రూ.45 వేల కోట్లు కావాలి. ఉచిత విద్యుత్ పథకానికి రూ.8 వేల కోట్లు కావాలి కానీ రూ. 2 వేల కోట్లు కేటాయించారు. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామన్నారు కానీ నిధులు కేటాయించలేదు." - హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Harish Rao Fires on Congress : గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల అప్పులు తెస్తే ఇష్టం వచ్చినట్లు గోబెల్స్ ప్రచారం చేశారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమకంటే రూ.19 వేల కోట్ల అప్పులు ఎక్కువగా తీసుకున్నారని మండిపడ్డారు. ఈ రూ.59 వేల కోట్లకు రాబడి అదనంగా ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. కొత్త పన్నులు వేస్తారా లేక భూములు అమ్ముతారా వీటన్నింటికి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?