BRS Leader KTR Tweet On NEET Exam Issue : నీట్ యూజీ ప్రవేశ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసే సున్నితమైన అంశాన్ని ఎన్డీఏ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. పరిష్కరించాల్సిన ఇంత పెద్ద సమస్యను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు కఠినంగా తిరస్కరించారని కేటీఆర్ అడిగారు.
ఇదే అంశంపై ఎన్డీయే సర్కార్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాసిన కేటీఆర్, గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్‌లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందన్నారు. అందులోనూ ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడం చూస్తే, పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు.
KTR Letter on NEET Exam : ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయన్న ఆయన, దీనివల్ల ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా రాష్ట్ర విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Harish Rao Slams on Central Govt Over NEET Exam : నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. చీటికి మాటికి విచారణలు చేసే కేంద్రం, నీట్ పేపర్ లీకేజీపై ఎందుకు కనీసం స్పందించడం లేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Student Unions on NEET Exam Scam : మరోవైపు నీట్ పరీక్షల లీకేజీ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్‌యూఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ సహా పలు విద్యార్థి సంఘాలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎన్టీఏని తక్షణం రద్దు చేసి, నీట్ నిర్వహణ రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్‌కు కారకులను కఠింగా శిక్షించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ మార్చ్‌కు పిలుపునిచ్చిన ఆయన, పరిస్థితి ఇలాగే కొనసాగితే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఎక్కడికక్కడ అడ్డుకోవటానికి సిద్ధమవుతునట్టు వివరించారు.
పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని నీట్ వ్యవహారంపై స్పందించాలి : కేటీఆర్ - KTR Letter On NEET Exam