Harish Rao Comments On CM Revanth : వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తాము(బీఆర్ఎస్ నాయకులు) వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే తమపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరన్న హరీశ్‌రావు తమకు వస్తున్న స్పందన చూసే కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది : బీఆర్ఎసీ ఎంపీ, ఎమ్మెల్యేల నెల వేతనాన్ని వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. వరద బాధితులకు ఉడతాభక్తిగా సాయం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తుందని విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్ద వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. బాధితులకు కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేయడం దురదృష్టకరం. తమ గురువులకు మద్దతుగా గురుకుల విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయం.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 5, 2024
ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి జాతీయస్థాయి… pic.twitter.com/tnjbFMvlfw
Harish Rao On Students : మరోవైపు రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై ఎక్స్ వేదికగా హరీశ్ రావు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించాయని ఆక్షేపించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేయడం దురదృష్టకరం అని విమర్శించారు. తమ గురువులకు మద్ధతుగా గురుకుల విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయమన్నారు.
అది అత్యంత దుర్మార్గమైన చర్య : ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో విద్యార్థులు ర్యాంకులు సాధించేలా వెన్నంటి నిలిచిన "గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ" ఉపాధ్యాయులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని హరీశ్‌రావు విమర్శించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం మధ్యలో ఏకంగా 6200 మంది గురుకుల ఉపాధ్యాయులను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల ఈ రోజు వేల మంది విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఏ విధమైన భేషజాలకు పోకుండా ఉద్యోగాల నుంచి తీసేసిన గురుకుల ఉపాధ్యాయులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని, భరోసా ఇవ్వాలని కోరారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో రకాలుగా కలలుగన్న తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారు రేవంత్ రెడ్డి? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.