Lok Sabha Elections 2024 : తెలంగాణ తరఫున కొట్లాడే ఎకైక పార్టీ బీఆర్ఎస్సేనని, గులాబీ బాస్ కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగలేదని, కాంగ్రెస్ రాగానే విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంచిర్యాలలో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌నే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే - తెలంగాణ గెలుపు ఉంది : కేసీఆర్ - Ex CM KCR Election Campaign
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ దుయ్యబట్టారు. అధికారంలో రాగానే వందరోజుల్లోపు డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామన్నారని, మళ్లీ ఆగస్టు 15 నాటికి వాయిదా వేశారని కేసీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మాటను ప్రజలు నమ్మకపోవడంతో, రుణమాఫీ చేస్తానంటూ దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. నాలుగు నెలల క్రితం ఇచ్చిన రైతుబంధు ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీలలో అయిదింటిని అమలు చేశామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, మంచిర్యాల మహిళలలకు నెలకు 2500 ఇస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు పోట్లాడుకుంటున్నారని, ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని, పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ నిలిచిపోయిందని దుయ్యబట్టారు. గామాల్లో అభివృద్ది పనులన్నింటిని పెండింగ్‌లో పెట్టారని పేర్కొన్నారు.
వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. పంటబోనస్ హామీ బోగస్ మాటగా మారిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే జిల్లాలు రద్దు చేస్తామని రేవంత్‌రెడ్డి అంటున్నారని, మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదానీలో ఒప్పందం కుదుర్చుకున్నారని, త్వరలో సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేయబోతున్నారని ఆరోపించారు.
మోదీ పాలనలో కార్పొరేట్ బిజినెస్మెన్లకు తప్ప, సామాన్యులకు జరిగిన మేలేమిలేదని కేసీఆర్ పేర్కొన్నారు. స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెచ్చి తల 15లక్షలు వేస్తామన్నారని, అందరికి పడ్డాయా అని ప్రశ్నించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ ప్రచారం చేస్తున్నారని, సాధారణ ప్రజలకు జరిగిన వికాసమెంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో భూగర్భ కార్మికుడికి, ఆగర్భశ్రీమంతుడికి పోరాటం జరుగుతోందని ఎవరిని గెలిపిస్తారో మీచేతుల్లో ఉందన్నారు.
'రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన నడుస్తోంది. అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమయ్యారు. మోదీపాలనలో పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బీజేపీకి ఓటేసిన, గోదాట్లో వేసిన ఒక్కటే'. - కేసీఆర్, మాజీముఖ్యమంత్రి