BRS Chief KCR Started Twitter Account : బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ట్విటర్ (ఎక్స్)లోకి ఇవాళ ఎంట్రీ ఇచ్చి, సామాజిక మాధ్యమం ద్వారా మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ట్విటర్ అకౌంట్ ఉంది. తాజాగా KCRBRSPresident పేరుతో ఎక్స్ ఖాతా ప్రారంభించారు.
సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన నేత అందుబాటులోకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అకౌంట్ తెరిచిన నిమిషాల్లోనే వేలాది మంది ఫాలోవర్లు ఆయనను అనుసరించడం ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణరాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీ బాస్ మొదటి పోస్టు చేశారు.
KCR Tweet on Power Cuts : రాష్ట్రంలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రతిరోజూ ఊదరగొడుతున్నారు కానీ, వాస్తవం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని కేసీఆర్ అన్నారు. ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే తనకు ఎదురైన సంఘటనను పంచుకున్నారు. మహబూబ్ నగర్లో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.
నియోజకవర్గాల్లో రోజుకు పదిమార్లు కరెంట్ పోతోందని మాజీ శాసనసభ్యులు ఆ సందర్భంగా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని బీఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి చేశారు.
Twitter Usage in Politics : ప్రతి రాజకీయ పార్టీతో పాటు, నేతలకూ ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ట్విటర్ ఖాతాను చాలా మంది ఉపయోగిస్తున్నారు. గల్లీ లీడర్లు మెుదలుకొని దిల్లీ లీడర్లు వరకు సామాజిక మాధ్యమాలను ఆయుధంగా చేసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కేవలం సభలూ, సమావేశాలతోనే కాకుండా ప్రత్యర్థులపై పంచులు ఇలా ప్రతీది సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ తాను అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఖాతా తెరిచినట్లు తెలుస్తోంది.
జాతీయ పార్టీలు రెండూ బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తున్నాయ్ : కేసీఆర్ - KCR Election Campaign 2024