Brahmotsavam Celebrations in Tirumala : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వరద హస్తం దాల్చిన వేంకటాద్రి హనుమంత వాహనంపై ఊరేగారు. రామావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్వేద నిష్ణాతుడిగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు తిరుమలేశుని తన మూపున వహించి తిరువీధులలో దర్శనమిచ్చే ఘట్టం భక్తజన రంజకంగా సాగింది. హనుమంతుని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు రాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని నమ్మకం. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు వాహన సేవను తిలకించారు. భక్తి పారవశ్యంతో స్వామిని దర్శించుకొని పులకించారు. ఆలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్థ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారికి గజ వాహనసేవ ఉండనుంది.
కిక్కిరిసిన తిరుమల గిరులు- గరుడ వాహనంపై శ్రీనివాసుడి వైభవం
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు వేచి ఉండాల్సి వచ్చిది. అన్ని కంపార్టుమెంట్లు శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్ వరకు భక్తులు నిలబడి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,043 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,100 మంది తలనీలాలు సమర్పరించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు వచ్చింది.
గజ వాహనంపై శ్రీవారి విహారం- ఒక్కసారి దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా!
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు మంగళవారం శ్రీవేంకటేశ్వర స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల దివ్యక్షేత్రంలో సాయంత్రం 6.30కి మొదలైన గరుడ వాహనసేవ అర్ధరాత్రి వరకూ కొనసాగింది. శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకరకంఠి ఆభరణాలను ఏడాదిలో ఒక్కసారి అదీ గరుడసేవ రోజు మాత్రమే ఉత్సవమూర్తి అయిన శ్రీమలయప్పస్వామికి అలంకరిస్తారు. ఉదయం స్వామివారు సర్వాలంకార భూషితుడై మోహినీ అవతారంలో శృంగార రసాది దేవతగా భక్తులను తన్మయపరిచారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. వాహన సేవల్లో తితిదే ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.