Action on Police about Borugadda Anil Issue: వైఎస్సార్సీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల విందు భోజనం అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్‌చల్ చేస్తోంది. మంగళగిరి కోర్టులో హాజరు పరిచి రాజమండ్రి తరలిస్తుండగా గన్నవరం క్రాస్ రోడ్స్ రెస్టారెంట్లో అనిల్‌కు రాచ మర్యాదలు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తుండగా పోలీసులు వాళ్ల ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేసారు. సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై గుంటూరు జిల్లా ఎస్పీ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
గుంటూరుకు చెందిన అనిల్ ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యారు. కానీ జగన్‌కు తొత్తుగా వ్యవహరించారు. జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నేతలపై సభ్యసమాజం తలదించుకునేలా సామాజిక మాధ్యమాలు, టీవీ డిబెట్‌లలో దూషణలు చేస్తూ హల్‌చల్ చేశారు. అప్పట్లో జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవారు. చంపేస్తానంటూ బెదిరించేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, లోకేశ్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తనపై ఉన్న కేసుల దృష్ట్యా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఎన్నికల ఫలితాల మరుసటి రోజు అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మూడు నెలలు పొరుగు రాష్ట్రాల్లోనే తలదాచుకున్నారు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని తెలుసుకుని గుంటూరులోని వేళంగిణి నగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
గతంలో జగన్ పేరు చెప్పి అనిల్ గుంటూరులో దందాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. జగన్ పేరు చెప్పడం వల్ల పోలీసుల అతని వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జగన్‌తో విబేధించి విమర్శలు చేయడంతో ఆయనను ఫోన్‌లో బెదిరించిన అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. బోరుగడ్డ అనిల్ నివాసం ఉండే బృందావన్ గార్డెన్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ కార్లలో వెళుతూ పెద్దపెద్దగా హారన్‌లు కొడుతూ అందరికీ నరకం చూపించారు.
రూ. 50 లక్షలు ఇవ్వాలని 2021లో అనిల్‌కుమార్ తనను బెదిరించారని, ఇవ్వకపోతే చంపుతానని అన్నాడని కర్లపూడి బాబు ప్రకాష్ అనే వ్యక్తి అరండల్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో అనిల్‌ను అరెస్ట్ చేయలేదు. ఇదేకాకుండా అరండల్‌పేట, పట్టాభిపురం, కొత్తపేట, పాత గుంటూరు, తాడికొండ, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలోనూ అనిల్‌పై కేసులు ఉన్నాయి. అరండల్‌పేట పీఎస్‌లో ఉన్న రౌడీషీట్‌ని పట్టాభిపురం ఠాణాకు బదిలీ చేశారు.
తాజాగా ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిపై దాడి కేసులో అనిల్‌కు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. అతన్ని మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో పోలీసులు రెస్టారెంట్‌కు తీసుకెళ్లారనే ఆరోపణలతో ఎస్పీ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
ఎట్టకేలకు చిక్కిన బోరుగడ్డ అనిల్ - ఈనెల 29 వరకు రిమాండ్
వైఎస్సార్సీపీ నేతల ఒత్తిడి, ప్రోద్బలంతోనే రెచ్చిపోయా : బోరుగడ్డ అనిల్