Bomb Threats to Hotels in Tirupati : తిరుపతి నగరానికి ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట మూడు రోజులుగా బాంబు బెదిరింపుల మెయిల్ సందేశాలు రావడం కలకలం రేపుతోంది. పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోటళ్లలో బస చేసే విదేశీయులను హతమారుస్తామంటూ పేర్కొనడంతో విస్తృత సోదాలు చేపట్టిన పోలీసులు బాంబు బెదిరింపులతో కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
3 రోజుల్లో 6 హోటళ్లకు బెదిరింపులు : తిరుపతి నగరానికి ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులుగా వస్తున్న మెయిల్ సందేశాలతో పలు హోటళ్లల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. శనివారం కపిలతీర్థం సమీపంలోని రాజ్ పార్కు హోటల్ తో పాటు మరో 2 హోటల్స్, ఈస్ట్ స్టేషన్ పరిధిలో ఒకటి, రూరల్ పరిధిలోని తాజ్ హోటల్ కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వెంటనే హోటల్ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
తిరుపతిలో హోటల్‌కు బాంబ్ బెదిరింపు - తనిఖీలు చేపట్టిన పోలీసులు
డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లు వెంటనే హోటల్స్‌కు వెళ్లి తనీఖీలు నిర్వహించాయి. బెదిరింపు మెయిల్స్ వచ్చిన రాజ్ పార్కు హోటల్ వెలుపల ఆగిన జమ్మూకశ్మీర్ రిజిస్ట్రేష న్ కారును తనిఖీ చేశారు. రష్యన్లు, మలేషియా వాసులు బస చేసే గదులపై ప్రత్యేక దృష్టి పెట్టి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబులూ లేవని తేల్చారు. మిగిలిన హోటళ్లనూ తనిఖీ చేసి ఫేక్ మెయిల్స్ అని నిర్ధారించుకున్నారు. 3 రోజుల్లో 6 హోటళ్లకు, తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది.
కంగారు పడాల్సిన అవసరం లేదు : తమిళనాడులో ఐఎస్ఐ ఉగ్రవాది జాఫర్ సాదిక్‌కు జైలు శిక్ష పడటంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట ఈ బెదిరింపులు వస్తున్నాయి. తమిళనాడుతో పాటు తిరుపతిలోని హోటళ్లకు బాంబు మెయిల్స్ రావటం సమస్యగా మారింది. కంగారు పడాల్సిన అవసరం లేదని బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి పంపుతున్నారనే విషయమై దర్యాప్త జరుగుతోందని మొత్తం ఆరు కేసులు నమోదు చేసినట్లు ఎఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు.
'దిల్లీ-హైదరాబాద్' విస్తారా విమానం దారి మళ్లింపు - ఎయిర్‌పోర్టులో విస్తృత తనిఖీలు
ప్రత్యేక బృందాలతో తనిఖీలు : మూడో రోజూ బాంబు బెదిరింపులు రాగా వరదరాజస్వామి ఆలయం, రీ నెస్ట్ , పాయ్ వైస్రాయ్ హోటల్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆలయాల్లో, హోటల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు.
'విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష'- కొత్త రూల్స్ ప్రకటించిన రామ్మోహన్ నాయుడు