Bomb Threat to Praja Bhavan : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కుటుంబాలు నివాసం ఉంటున్న ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. కాసేపట్లో బాంబు పేలుతుందని అజ్ఞాత వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి చెప్పడంతో, రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులూ అప్రమత్తమయ్యారు. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్‌కు చేరుకొని అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ప్రజాభవన్ ఎంట్రెన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో పాటు భట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబసభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలోనూ తనిఖీలు చేశారు.
చార్మినార్‌కు బాంబు బెదిరింపు.. అలాంటిదేమీ లేదన్న పోలీసులు
ప్రస్తుతం ప్రజా భవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. బాంబు పెట్టామంటూ ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. సెల్‌ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయా? లేక కావాలని ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్‌లో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం ప్రచార మాధ్యమాల్లో రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది.
హైకోర్టులో బాంబు కలకలం!.. పోలీసులు హై అలర్ట్.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్..
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికీ గతంలో ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయి. విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు మెయిల్ ద్వారా బెదిరింపు రాగా, వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ (CISF) అధికారులు రంగంలోకి దిగారు. వారితో పాటు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా బాంబు కోసం వెతికాయి. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.