Boiler Exploded in Ultratech Cement Factory in Bodawada : ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బోదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పేలుడు సంభవించింది. కర్మాగారంలోని కీలన్ సెక్షన్లో బాయిలర్ పేలడంతో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతులు వెంకటేశ్వర రావు, అర్జున్‌లుగా గుర్తించారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న మరో 14 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో కొందరికి ఒళ్లంతా కాలిన గాయాలు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. మొత్తం 14 మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
వీరిలో 10 మంది స్థానికులు కాగా, మరో 10 మంది ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల వ్యక్తులుగా గుర్తించారు. గాయపడిన వారిని హుటాహుటిన జగ్గయ్యపేట, విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ సృజన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. చిలకల్లు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
చంద్రబాబు ఆదేశాలు : బాయిలర్ పేలిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంవో అధికారులతో మాట్లాడి తెలుసుకున్న చంద్రబాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడడంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
స్పందించిన మంత్రి : పేలుడు ఘటనపై స్పందించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రీ హీటర్ లోపంతో పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని తెలిపారు. ప్రీ హీటర్‌ను జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలమైందని అన్నారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పేలుడు ఘటనపై నివేదిక ఇవ్వాలని మంత్రి సుభాష్ అధికారులను ఆదేశించారు.