BJP Vijaya Sankalpa Yatra 2024 : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటేలా సమరశంఖం పూరించిన భారతీయ జనతా పార్టీ 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా విజయ సంకల్ప యాత్రలు కొనసాగిస్తోంది. నారాయణపేట జిల్లాలో కృష్ణమ్మ క్లస్టర్ విజయ సంకల్పయాత్రలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లేస్తే మూసీలో పడినట్లేనని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Kishan Reddy Comments BRS : కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం మరిచినా కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోయినా బీఆర్ఎస్ జరిగే నష్టం ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్‌పై అపుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న ఆయన హామీలు అమలుచేయలేక పోతోందని విమర్శించారు.
"ఈ జిల్లా యువత, విద్యార్థులకోసం పాలమూరు విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు ప్రధాని మోదీ మంజూరు చేశారు. ఆయుష్మాన్ భారత్ పేరిట రూ.5లక్షల కార్పొరేట్ వైద్యాన్ని కేంద్రం అందిస్తుంది. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్యలు లేవు. మోదీ హయాంలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రెండోరోజు కొనసాగిన బీజేపీ విజయ సంకల్పయాత్ర - కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కమలం నేతల ఫైర్
BJP Vijaya Sanklpayatra Third Day : కుమురంభీం క్లస్టర్ బీజేపీ విజయసంకల్ప బస్సు యాత్రలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడింది కమలం పార్టీ కార్యకర్తలేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. హస్తం పార్టీ నాయకులు ఏ నాడైనా కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారా అని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ వాటి ఊసెత్తడం లేదని విమర్శించారు. కోలుకోలేని స్థితిలో ఉన్న బీఆర్ఎస్తో తమకు పొత్తు ఉండదని బండి సంజయ్ తేల్చిచెప్పారు.
BJP Focus on Parliament Elections 2024 : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన యాత్రకు సీనియర్ నేత లక్ష్మణ్ హాజరయ్యారు. పదేళ్లలో మోదీ సర్కార్ దేశాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని బలపరిచి 17 ఎంపీ సీట్లను గెలిపంచాలని ప్రజలను కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఈటల ఆత్మకూరులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చి హస్తం పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
MP Aravind at Vijaya Sankalpa Yatra : నిజామాబాద్ గ్రామీణం, బాల్కొండలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. ఏళ్లుగా సాధించని పసుపు బోర్డును బీజేపీ ప్రభుత్వ హయాంలో సాధించామని అర్వింద్ అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ నాలుగు వందల సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తన జోలికి వస్తే కాంగ్రెస్ నాయకుల చరిత్ర అంతా బయట పెడతానని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సమగ్రంగా విచారణ జరిపి నిందితులను జైలులో పెట్టాలని అర్వింద్ డిమాండ్ చేశారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి సిద్ధం : ఈటల
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సమరశంఖం - ప్రచారరథాలు ప్రారంభించిన కిషన్ రెడ్డి