BJP MP Laxman Comments on Congress : హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌కు అండగా లేరనే అక్కసుతోనే హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే ఇండ్లకు అనుమతులు ఇచ్చి, ఇప్పుడు కూల్చడం సరికాదన్నారు. మూసీ ప్రాంతంలో పట్టాలు ఇచ్చిన వారే ఆక్రమణ అనడం సరికాదన్నారు. సురక్షితంగా ఉన్న ప్రాంతాల్లో కూల్చివేతలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. సుందరీకరణ పేరుతో పేదల కడుపు కొడతారా? అని ప్రశ్నించారు. కూల్చివేత చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ బాధిత ప్రజల పక్షాన అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, కానీ దాని పేరుతో దిల్లీకి కప్పం కట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు.
ఆరు గ్యారెంటీలంటూ మోసం : ఎన్నికలు అనగానే ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని అన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపించడం కాంగ్రెస్‌కు కొత్తకాదని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
రైతు బంధు సహా అన్నీ బంద్ : తెలంగాణలో 6 గ్యారెంటీలు ప్రకటించి అమలు చేయలేక హైడ్రా పేరుతో ప్రజల దృష్టి మరలుస్తున్నారన్నారు. హరియాణా ప్రజలు కాంగ్రెస్ హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవినీతి, కుటుంబ పాలన, బంధు ప్రీతి, రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు కాంగ్రెస్ గ్యారెంటీ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు హరియాణా ప్రజలు పడొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రైతు బంధు సహా అన్నీ బంద్ చేశారని తెలిపారు.
తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మారిస్తే, దాన్ని పట్టుకొని రేవంత్ దిల్లీ పర్యటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ 50 శాతం కూడా చేయలేకపోయారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ఎంపీ స్వయంగా పార్లమెంట్లో చెప్పి తప్పుదోవ పట్టించారన్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని రాహుల్ గాంధీ నమ్మపలికి ఇప్పుడు మోసం చేశారన్నారు.
రాహుల్ గాంధీ అబద్దాలు చెప్పారా? లేక రాహుల్ గాంధీ మాటలు రేవంత్ పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. హరియాణాలో కాంగ్రెస్ 7 హామీలు ఇచ్చారని, కాంగ్రెస్‌కు అక్కడి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. 9 నెలల్లోనే తెలంగాణలో రేవంత్ సర్కారుపై వ్యతిరేకత మొదలైందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టుల పట్ల గౌరవం లేదు : ఎంపీ లక్ష్మణ్ - BJP MP LAXMAN FIRES ON CM REVANTH