BJP MP Etela Rajender Comments On CM Revanth : ఇండియా కూటమి అధికారం చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెకిలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. చంద్రబాబు, నితీష్ కుమార్ను కలుస్తామని అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా మోదీ మూడోసారి ప్రధాని కావాలని బీజేపీకి ఓటేశారని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నెహ్రూ తరువాత మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.
BJP 8 Seats wins Telangana Elections 2024 : ఖమ్మం, మహబూబ్ బాద్ తప్పితే అన్ని స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగిందన్నారు. ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చి స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారన్న ఈటల భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటి చెప్పారని తెలిపారు. మల్కాజిగిరి తన సీటు, మహబూబ్‌నగర్ తన సొంత నియోజకవర్గమని వీర్రవీగిన రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి బుద్ది చెప్పారని పేర్కొన్నారు.
బీజేపీ హయంలో పేదవాడికి సొంత ఇళ్లు : రాష్ట్రంలో విజయం సాధించిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అపార అనుభవం కల్గిన వ్యక్తులగా పేర్కొన్న ఈటల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహాయ సహకారాలను తీసుకుంటామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే వెంటపడి పని చేయిస్తామన్నారు. తెలంగాణలో పేదవాడికి సొంత ఇళ్లు కట్టించడం మా బాధ్యత అన్నారు.
"హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తాం. రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉండాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయమని జనం చాటిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో పేదవాడికి సొంత ఇళ్లు కట్టించడం మా బాధ్యత." -ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీ