Etala Rajender Reacted On Crop Loan Waiver Rules : రుణమాఫీ నిబంధనలే రైతులకు ఉరితాళ్లని, నిబంధనల పేరిట లబ్ధిదారులను తగ్గించేందుకు సీఎం చూస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. దరఖాస్తులు తీసుకొని 7 నెలలైనా రేషన్‌కార్డులు ఇవ్వని ముఖ్యమంత్రి రుణమాఫీ కావాలంటే తెల్లరేషన్ కార్డు ఉండాలని నిబంధనలు పెట్టాడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడు నెలలు కాకముందే ఏడు రకాల తిప్పలు పెడుతుందని ధ్వజమెత్తారు.
రాజకీయ పార్టీలు, నాయకులు తెలంగాణ ప్రజానీకం మోసం చేసే నాయకులనే నమ్ముతారని రేవంత్ రెడ్డి చెప్పారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. దేశ, రాష్ట్ర ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించరన్నారు. విశ్వసనీయత లేని ప్రభుత్వమనే కేసీఆర్‌కు బొంద పెట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడలో కూర్చొని అహంకారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
తెల్ల రేషన్ కార్డు ఎవ్వరికీ వస్తుందా రేవంత్ రెడ్డి తెలుసా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అసలు నువ్వు చదువుకున్నావా?, తెల్ల రేషన్ కార్డు షరతు పెట్టడం అంటే రైతులను అవమానించడమే అవుతుందన్నారు. ఆదాయ పన్ను చెల్లించే వాళ్లకు రుణమాఫీ వర్తించదంటున్నారని, కంపెనీలే కాదు రైతులు కూడా ఎంతో కొంత ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలను నమ్మడం లేదని దేవుళ్ల మీద ప్రమాణం చేశారని గుర్తుచేశారు.
రీ షెడ్యూల్ చేసుకున్న వాళ్లకు రుణమాఫీ వర్తించదని నిబంధన పెట్టారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. 34వేల కోట్ల రూపాయలను ఒకేసారి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇన్ని నిబంధనలు విధిస్తున్నారంటే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయరని జోష్యం చెప్పారు. అధికారం చేపట్టి ఏడు నెలలు కాకముందే రేవంత్ రెడ్డి ఏడు రకాల తిప్పలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల శాపనార్థలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగలడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు ఎంతకు అమ్ముడుపోయారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. తాజాగా పార్టీ ఫిరాయింపుల విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ జుట్టులోకెళ్లి వచ్చాడని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతు రుణమాఫీ, రైతు బంధు, బోనస్ ఇవ్వడం మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్లు, కేసీఆర్ పై బీజేపీ పోరాటం చేస్తే కాంగ్రెస్ గద్దెనెక్కిందని తెలిపారు.