BJP Leaders Protest on Congress : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని వర్గాలకు సమన్యాయం పాటించలేదని, మహిళలకు నిధులు కేటాయించలేదని బీజేపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో అంబేడ్కర్ విగ్రహం ముందు బీజేపీ మహిళా మోర్చా నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు మహిళా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. హామీలు నెరవేర్చకపోతే త్వరలోనే గాంధీభవన్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని బీజేపీ మహిళా మోర్చా నేతలు హెచ్చరించారు. తెలంగాణ బడ్జెట్‌లో మహిళలకు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్ గాడిద గుడ్డు తప్ప ఏమీ లేదన్నారు. మహిళలకు హామీల ఆశ చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్, బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న మహిళా మోర్చా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
'ప్రతి మహిళకు రూ.2500, ప్రతి నెల రూ. 4వేల పింఛన్, అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. మహిళల పట్ల ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గాంధీ భవన్‌తో పాటు సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తాం.' - శిల్పారెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు
రాజకీయ ప్రసంగంలాగా రాష్ట్ర బడ్జెట్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను గాడిద గుడ్డుతో పోల్చిన కాంగ్రెస్ నాయకులు, మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్‌ను ఏమంటారని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు విమర్శించారు. నగరంలోని బర్కత్‌పురలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. బడ్జెట్‌ను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని, భట్టి విక్రమార్క చదివిన బడ్జెట్ అంతా కూడా ఒక రాజకీయ ప్రసంగంలాగా ఉందని విమర్శించారు.
రాష్ట్రానికి వెన్నెముక లాంటి హైదరాబాద్ అభివృద్ధిని గాలికి వదిలేసిందని గౌతమ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో భారీ వర్షాలు వస్తే చెరువులుగా మారుతున్నా ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. మహిళలకు, గిరిజనులకు ఇప్పటికే అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 6 గ్యారంటీల అమలు గురించి ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదన్నారు.
అంకెల గారడీ, ఆర్భాటం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదు : బీజేపీ - BJp on Telangana Budget 2024
కాంగ్రెస్ అసమర్థ పాలనతో కేంద్రాన్ని నిందిస్తోంది : పాయల్ శంకర్ - BJP MLAS Fires on Congress Party