Health Minister Satya Kumar in Assembly Sessions: అయ్యన్నపాత్రుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అరాచక ప్రభుత్వం చేసిన దాడులను తట్టుకుని ముందుకు వెళ్లారన్నారు. దశాబ్దాలుగా ప్రజల వాణిని తనదైన బాణిలో వినిపించారన్నారు. నాలుగుసార్లు మంత్రిగా అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మీ సుదీర్ఘ ప్రజాజీవితం మా అందరికీ స్ఫూర్తి దాయకమని కొనియాడారు.
గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి బెదిరించినా ఎదురొడ్డి నిలబడ్డారని సత్యకుమార్ పేర్కొన్నారు. రాజకీయ చరిత్రలో గత ఐదేళ్లు రాష్ట్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఏపీని అవినీతి దిశవైపు మళ్లించారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి అనేక నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్పీకర్గా ఎన్నుకనే ముఖ్యమైన కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలు లేకపోవడం వారు సభా మర్యాదలను కించపరిచినట్లేనని సత్యకుమార్ అన్నారు.
ఏపీ 16వ శాసనసభ సమావేశాల్లో రెండో రోజు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభం కాగానే, ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. స్పీకర్ పదవికి, చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్ ప్రకటించగానే ఆయ్యన్న పాత్రుడును సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ శాసన సభా పక్ష నేతలు కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ గురించి ప్రసంగించారు.