BJP Focus On Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో బీజేపీ ముందస్తుగానే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తయినందున మొదటి విడత ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రధాని మోదీ రెండు విడతలుగా ప్రచార సభల్లో పాల్గొనగా అగ్రనేత అమిత్‌షా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంలోనూ బీజేపీ ప్రత్యేక పంథాలో సాగింది.
ప్రధానంగా విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్తవారికి ప్రాధాన్యమిచ్చింది. ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు జాతీయ నాయకత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఒకటి మినహా అన్ని స్థానాల్లో లక్ష్యం మేరకు చేరికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.
పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాకు బీజేపీ కసరత్తు- ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ
BJP MP Candidates List 2024 : టికెట్ల కేటాయింపులోనూ బీజేపీ అధిష్ఠానం సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. రెండు ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో గిరిజనుల్లో కీలకమైన ఇరు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలను పార్టీలోకి చేర్చుకుని పోటీలో నిలిపింది. ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీని కాదని మాజీ ఎంపీ నగేశ్‌కు టికెట్ ఇవ్వగా మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలో లంబాడాలకు ప్రాధాన్యమిస్తూ ఎంపీ సీతారాం నాయక్‌ను బరిలోకి దింపింది.
17 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు : ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ ఇదే పంథా అనుసరించిన బీజేపీ నాగర్‌కర్నూల్‌లో సిట్టింగ్ ఎంపీ రాములును పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుడు భరత్ ప్రసాద్‌కు టికెట్ ఇచ్చింది. పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్, వరంగల్‌లో ఆరూరి రమేశ్‌కు అవకాశం ఇచ్చింది. ఇటీవల అసెంబ్లీ పోరులో ఓటమి పాలైన ఈటల రాజేందర్, రఘునందన్‌రావులను లోక్‌సభ బరిలోకి దించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బి.బి.పాటిల్‌ను పార్టీలో చేర్చుకుని జహీరాబాద్ అభ్యర్థిగా నిలిపింది. ఇక నియోజకవర్గ, మండల స్థాయి నేతల చేరికలపై దృష్టి సారించింది. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా ముందుకెళ్తోంది.
తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల ప్రచారం : మలివిడత జాతీయ నేతల ప్రచారంపై రాష్ట్ర నాయకులు దృష్టి సారించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ల బహిరంగ సభలను వేర్వేరు చోట్ల నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నోటిఫికేషన్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు. ప్రచారంలో జాతీయ నేతల సభలతోపాటు క్షేత్రస్థాయిలో బూత్ నుంచి కార్యక్రమాల ఎజెండాను రూపొందించారు.
బీజేపీ రెండో జాబితా విడుదల - తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు
తెలంగాణలో మరింత కష్టపడితే 15 స్థానాల్లో గెలుస్తాం : అమిత్ షా