BJP State Election Committee Meeting In Delhi : బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ దిల్లీలో భేటీ అయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 16 లోపే తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 17 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అర్వింద్, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్ డీకే అరుణ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్దపల్లి, మహబూబాబాద్‌లలో కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. నాగర్ కర్నూల్, వరంగల్, జహీరాబాద్, అదిలాబాద్‌లలో బీఆర్ఎస్ నేతలపై కన్నేసింది. మల్కాజిగిరి, మెదక్, హైదరాబాద్‌లలో ఎవరిని బరిలోకి దించాలనేది కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఖమ్మం, నల్గొండలలో కూడా బయటి నుంచి వచ్చిన వారికే అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది.
చేరికలు, బస్సు యాత్రలు, నారీ శక్తి వందన్‌తో ప్రజల్లోకి - ఫిబ్రవరి నెలంతా బీజేపీ బిజీబిజీ
BJP Focus On Lok Sabha Elections 2024 : తెలంగాణలోని 17 పార్లమెంట్ సీట్లలో కనీసం పది సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను రూపకల్పన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీసీలకు 5 స్థానాలు తగ్గకుండా కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించి ఆయా వర్గాల ఓట్లు రాబట్టాలని అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండటంపైనా ఫోకస్ పెట్టిన కమలం పార్టీ, మూడు స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని ప్లాన్ చేస్తోంది.
ఈ నెల 28న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్, మార్చి 5న నోటిఫికేషన్ రానుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 16వ తేదీ వరకు పూర్తి చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాతే బీజేపీ ప్రకటించింది. దీంతో చివరి వరకు ఎవరు బరిలో ఉంటారోనన్నది సందిగ్ధంగా మారింది. ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలాంటి ఇబ్బందులకు ఏమాత్రం అవకాశమివ్వొద్దని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్ పరివార క్షేత్రాలు - అసలేం జరిగింది?
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం - ఆ మూడు స్థానాలు సిట్టింగులకే