CONTRACTORS BILLS ISSUE IN AP: పెద్ద గుత్తేదారు సంస్థలకు అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులపై చిన్న గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. జలజీవన్ మిషన్ పనుల్లో రెండు పెద్ద గుత్తేదారు సంస్థలైన మేఘా ఇంజినీరింగ్, ఎన్‌ఏఆర్ ఇన్‌ఫ్రా (NAR Infra) లకు మేలు చేస్తూ రెండు సంస్థలకూ కలిపి గత నెల 31న ఒకే రోజు 96.67 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. దీంతో చిన్న చిన్న పనులు చేసే గుత్తేదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
అనేక జిల్లాల్లో నిలిచిపోయిన పనులు: బిల్లుల చెల్లింపు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న చిన్న గుత్తేదారులు విజయవాడలో గత నెల 23న సమావేశమై జేజేఎం పనులకు బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ జాప్యంతో దివాలా తీసే పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో అనేక జిల్లాల్లో పనులు నిలిచిపోయాయని వాపోయారు.
ఏడు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం: మొదట అప్‌లోడ్ చేసిన బిల్లులకు తొలుత బిల్లులు చెల్లించాలన్న విధానానికి ప్రభుత్వం, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు నీళ్లొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పాటించకపోతే పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. కానీ వారి వాదన అరణ్య రోదనే అయ్యింది. జలజీవన్ మిషన్ పనుల్లో రెండు పెద్ద గుత్తేదారు సంస్థలైన మేఘా ఇంజినీరింగ్, ఎన్‌ఏఆర్ ఇన్‌ఫ్రాలకు మేలు చేస్తూ ఏడు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 96.67 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు చెల్లించింది.
చిన్న బిల్లులు తిరస్కరించి మరీ పెద్దవి చెల్లింపు: పెద్ద గుత్తేదారు సంస్థలకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వ పెద్దల సూచనతో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు పెద్ద ప్లానే వేసి అమలు చేశారు. పొడిగించిన ఒప్పంద సమయం దాటాక బిల్లులు అప్‌లోడ్ చేశారన్న కారణంతో చిన్న గుత్తేదారులకు చెల్లించాల్సిన దాదాపు 650 కోట్ల బిల్లులను ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్లు ఇటీవల తిరస్కరించారు.
ఉత్తర్వులను తుంగలో తొక్కిన ఆర్‌డబ్ల్యుఎస్ ఉన్నతాధికారులు: గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో అందరికీ సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ గత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ 2023 నవంబరు 18న ఇచ్చిన ఉత్తర్వులను ఆర్‌డబ్ల్యుఎస్ ఉన్నతాధికారులు తుంగలో తొక్కారు. మొదట బిల్లులు అప్‌లోడ్ చేసిన గుత్తేదారులకు తొలుత చెల్లించాలని, నిధులు పరిమితంగా ఉంటే అందరికీ సమానంగానైనా ఇవ్వాలని ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీని ఆదేశించారు. రాజశేఖర్‌ను ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆయన ఉత్తర్వులనూ ఇంజినీర్లు పక్కన పెట్టారు.