Bhatti Vikramarka React on Chenchu Woman Incident : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఈ ఘటన ఆమానవీయమని విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి ధైర్యం చెప్పారు.
Attack on Chenchu Woman in TG : బాధిత మహిళకు అందుతున్న వైద్య సహాయంపై భట్టి ఆరా తీశారు. ఆమెకు మంచి మెరుగైన వైద్య చికిత్స అందించాలని, పూర్తి ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని నిమ్స్ వైద్య అధికారులకు సూచించారు. చెంచు మహిళపై దాష్టీకం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు తలదించుకునే ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితురాలిని పరామర్శించి, నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని గుర్తు చేశారు.
Chenchu Woman Brutally Hurt Incvident : మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి సైతం తరలించారని భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఘటన విషయాన్ని మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. బాధితురాలు పూర్తిగా ఆరోగ్యంతో కోలుకునే వరకు ఉచితంగా ప్రభుత్వపరంగా వైద్య సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో ఇల్లు లేని పక్షంలో ఇందిరమ్మ ఇల్లు, ఇద్దరు పిల్లలను ఆశ్రమ పాఠశాలలో ఎంతవరకు చదివితే అంతవరకు చదివించడమే కాకుండా సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూమి కేటాయించడం వంటి అన్ని చర్యలు ప్రభుత్వపరంగా చేపడతామని భరోసా ఇచ్చారు.
"చెంచు మహిళపై దాష్టీక ఘటనలో సమీప బంధువులైన బావ, అక్కతో పాటు బయట ఒకరు ఇద్దరు ఉన్నట్టు సమాచారం ఉంది. నిందితులను ఇప్పటికే రిమాండ్‌కు తరలించాం. ఈ ఘటనలో పూర్తి సమాచారం సేకరించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
చెంచు మహిళపై దాష్టీకం - నిందితులను వదిలేది లేదని జూపల్లి హెచ్చరిక - Attack on Chenchu Woman