Dussehra Bonus to Singareni Workers : ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో ఇవాళ పలువురు మంత్రుల సమక్షంలో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వాలు సింగరేణి లాభాల్లో కార్మికులకు కోతపెట్టాయని పేర్కొన్నారు.
నేడు సింగరేణి కార్మికులు సంస్థకు ఆదాయం తీసుకువస్తున్నారని, ఆదాయానికి అనుగుణంగా వాటా ఇస్తున్నట్లు భట్టి తెలిపారు. ప్రస్తుతం బొగ్గు బావులు అంతరించిపోతున్నాయని, బొగ్గు పరిశ్రమలను ప్రోత్సహించవద్దని ప్రపంచం ఆలోచిస్తోందన్నారు. సింగరేణిలో దాదాపు 40 వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారని, మరో 25 వేల మంది పొరుగు సేవల విధానంలో పని చేస్తున్నారని తెలిపారు. దాదాపు లక్ష మంది పని చేసే సింగరేణి సంస్థను బతికించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదాయం పెంపునకు దృష్టిసారించాలి : శాశ్వత ఉద్యోగి ద్వారా టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.3500 ఖర్చవుతోందని, భూగర్భంలో టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.9 వేలు ఖర్చవుతోందని భట్టి తెలిపారు. ఒప్పంద కార్మికుల ద్వారా టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.1500 ఖర్చవుతోందన్నారు. ఖర్చును తగ్గించే ప్రయత్నం చేస్తే ఆదాయం పెరుగుతుందని, వ్యత్యాసం లేకుండా సమతూకం చేసుకుని సింగరేణి కార్మికులు ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
సింగరేణి సంస్థలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అన్యాయం జరగాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాల కోసం కమిటీ వేస్తామని ఆయన తెలిపారు. సింగరేణి కార్మికుల కోసం మంచి ఆస్పత్రి తీసుకువస్తామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ కార్మికులదేనని, ప్రభుత్వం కేవలం మార్గదర్శకత్వమే చేస్తుందని వెల్లడించారు.
"ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సింగరేణి సంస్థలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అన్యాయం జరగాల్సిన అవసరం లేదు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాల కోసం కమిటీ వేస్తాము. సింగరేణి కార్మికుల కోసం మంచి ఆస్పత్రి తీసుకువస్తాము. సింగరేణి సంస్థ కార్మికులదే, ప్రభుత్వం కేవలం మార్గదర్శకత్వమే చేస్తుంది". - భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి