Bhagyanagar Ganesh Utsav Committee Meeting : గత రెండేళ్లుగా గణేశ్ నిమజ్జన ఉత్సవాలకు గత ప్రభుత్వం ఏ విధంగా అవకాశం ఇచ్చిందో, సహకరించిందో ఈసారి కూడా అదే విధంగా ఇవ్వాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. గణేశ్ విగ్రహాలను శాంతియుతంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా నిమజ్జనం చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో గణేశ్ ఉత్సవాలు, గణేశ్ నిమజ్జనం, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి కోర్టు ఉత్తర్వులు తదితర అంశాలపై ఈ కమిటీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు.
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం నిలిపివేశామని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, పోలీసుల పేరుతో ట్యాంక్ బండ్‌పై ప్లెక్సీలు వెలిశాయని దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఉన్న అపోహాలు తొలగించేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. 2022,2023లో గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏవిధంగా అవకాశం ఇచ్చిందో ఇప్పుడు అదే విధంగా అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మార్గాల్లో యథావిధిగా నిమజ్జనాలు : ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్లో గణేశ్ నిమజ్జనాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తుందన్నారు. భక్తులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. విగ్రహాలు తయారీ చేసే క్రమంలోనే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అంశాన్ని చర్చించాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ ఇప్పటికే విగ్రహాలు తయారు అయ్యాయని, పూజలు అందుకుంటున్నాయని గుర్తు చేశారు. తీరా నిమజ్జనం చేసే క్రమంలో ఇలాంటి ప్రశ్నే తలెత్తదన్నారు. తాము ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం పీఓపీ విగ్రహాలపై దృష్టి పెట్టాలి : మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాలని ప్రచారం చేస్తున్నామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తెలిపింది. కానీ మార్పు ఒక్కసారే సాధ్యం కాదన్నారు. ఇప్పటికే చాలా మంది మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. భక్తుల్లో మార్పు క్రమక్రమంగా వస్తుందని చెప్పారు. ప్రభుత్వ కూడా విగ్రహాల తయారీ దశలోనే పీఓపీ విగ్రహాలపై దృష్టి సారించాలని సూచించారు. నిమజ్జనం కోసం గతంలో ప్రభుత్వం బేని పాండ్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు.
ఇప్పుడు కూడా అలాంటి ఏర్పాట్లనే చేస్తుందన్నారు. హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల ఎటువంటి కాలుష్యం జరగడం లేదని సర్వేలే తేల్చాయని చెప్పారు. ఇక విగ్రహాలను ప్రతిష్ఠించిన నేపథ్యంలో నిమజ్జనం సమస్య ఉత్సవ సమితిది కాదని ప్రభుత్వానిది మాత్రమే అని సమితి సభ్యులు తెలిపారు.
"మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ వస్తున్నాం. అలాగే మండపాల్లో పెట్టే విగ్రహాలను కూడా వీలైనంత వరకు పీఓపీ, మట్టి కాకుండా వేరే మార్గాల్లో విగ్రహాలను తయారు చేస్తే బాగుంటుందని చెప్పాం. ఆ రకమైన స్టాండ్స్ ఉంటే మేము కూడా కాలుష్యంపై పోరాడుతాం. 2022,2023లో ఎలా అయితే నిమజ్జనానికి అనుమతులు ఇచ్చారో ఈసారి కూడా అలాంటి అనుమతి, సహాయమే అందించాలి. అప్పుడే ఎలాంటి గందరగోళం లేని నిమజ్జనం జరుగుతుంది." - రాజవర్ధన్ రెడ్డి, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి
హుస్సేన్‌సాగర్‌లో గణపయ్య నిమజ్జనం - హైకోర్టు కండిషన్స్ ఇవే - Hussain Sagar Ganesh Immersion