Special Story On Red Ant Eggs Pickle : ఎర్రచీమలు అంటేనే అవి శరీరంపై కుడతాయని, ఫలితంగా శరీరం తీవ్ర నొప్పికి గురౌతుందని మనందరికీ తెలిసిందే. అయితే ఆ ఎర్రచీమల గుడ్లతో పచ్చడి, కూర చేస్తారని మీరెప్పుడైనా విన్నారా? ఇప్పటికీ కొంతమంది గిరిపుత్రులు వేసవి వచ్చిందంటే చాలు ఎర్రచీమల గుడ్లకోసం అడవులకు వెళ్లి మరీ సేకరిస్తున్నారు. వారు ఇతర దేశాలకు చెందిన వారంటే అదీ కాదు. మన రాష్ట్రంలో ఉన్నవారే కావడం మరో విశేషం. ఇంతకీ వారి కథేంటో ఓ సారి చూద్దామా?
Red Ant Eggs pickle Story : వారు అడవినే జీవనాధారంగా నమ్ముకుని జీవిస్తున్న గిరిపుత్రులు. ప్రకృతితో మమేకమైన వారు అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో నివసిస్తూ ప్రకృతి సిద్ధంగా లభించే వాటితో తమ ఆహారపోషణ చేసుకుంటుంటారు. అలాంటి వాటిలో ఒకటే ఈ ఎర్రచీమల గుడ్ల పచ్చడి. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో నివసించే గిరిపుత్రులు వేసవి కాలంలో ఏప్రిల్, మే నెలల్లో దట్టమైన అడవుల్లోకి వెళ్లి చీమల గుడ్లను సేకరించి పచ్చడిగా చేసుకుని తింటారు.
Tribal's Favorite Red Ant Pickle : ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో చెన్నాపురం గ్రామస్థులు ఏప్రిల్ చివరి వారం కావడంతో ఎర్రచీమల గుడ్లు తయారు చేసి పచ్చడి కూర తయారు చేసుకుంటున్నారు. ఇందుకోసం సమీపంలోని అడవులకు వెళ్లి పెద్దపెద్ద చెట్లపై ఉన్న చీమల గూడులను పగలగొట్టి వాటి నుంచి ఎర్రచీమల గుడ్లను సేకరిస్తున్నారు. వీటిని సేకరించే క్రమంలో చీమలు చర్మంపై కుడుతున్నా లెక్కచేయకుండా చీమల పచ్చడికోసం గూడులను పగుల గొట్టి గుడ్లు తీసుకొస్తున్నారు.
చెట్లపై నుంచి సేకరించిన ఎర్రచీమల గుడ్లను ఇళ్లకు తీసుకునివెళ్లి పచ్చడి తయారు చేసుకుంటారు గిరిపుత్రులు. ఎర్రచీమల గుడ్లను ఉడకబెట్టి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చివేసి రోటీపై వేసి నూరుతారు. అనంతరం అందులో కొంచెం ఉప్పు వేసి బాగా నూరుకుంటారు. వేడివేడి అన్నంతో పాటు ఈ ఎర్రచీమల పచ్చడిని తింటూ ఉంటే ఆ రుచే వేరు అని అంటున్నారు గిరిపుత్రులు. పచ్చడిగానే కాదు కూర కూడా చేసుకుని తింటామని వారు చెబుతున్నారు. అంతే కాదండోయ్ ఈ ఎర్రచీమల గుడ్లను సేకరించి ఛత్తీస్‌గఢ్‌లోని వారాంతపు సంతలో విక్రయిస్తారట. గిరిపుత్రుల జీవనవిధానంలో అనాదిగా వస్తున్న ఆహారపు అలవాట్లలో ఈ ఎర్ర చీమల పచ్చడిది ప్రత్యేక స్థానమట.