Buying Residential Property in City Outskirts Benefits: తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లుగానే మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నగర శివార్లలో కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల ప్రాంతంలో నాలుగో సిటీ రూపుదాలుస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలలో భూములు కొనుగోలు చేస్తే వారి జీవితం బంగారుమయం అవుతుందంటున్నారు రియల్‌ఎస్టేట్(Real Estate) రంగం నిపుణులు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నేటి రోజుల్లో నగరంలోని అన్ని శివారు ప్రాంతాలకు మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. రహదారుల విస్తరణతో ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు ఉండడం.. వీటికి తోడు ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెట్టడంతో ప్రస్తుతం శివారు ప్రాంతాలు నగరానికి ఎంతో చేరువయ్యాయి. అదే.. ఒకప్పుడు మేడ్చల్‌కు వెళ్లాలంటే ఎంత దూరమో అనిపించేది. బీహెచ్‌ఈఎల్ దాటి తెల్లాపూర్‌కు వెళ్లాలంటే మహాకష్టం. ఇదే పరిస్థితి ఘట్‌కేసర్, ఉందానగర్ ప్రాంతాలది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఈ క్రమంలోనే అప్పట్లో చాలా మంది నగర శివార్లలో ప్రజా రవాణా ఉన్న ప్రాంతాల్లో తక్కువ ధరలో భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు వారి స్థిరాస్తుల ధరలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. ప్రస్తుతం కూడా ఇలాంటి అవకాశాలు మార్కెట్లో ఉన్నాయని రియల్టర్లు అంటున్నారు. కాబట్టి, నగర శివార్లలో భూములు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదొక మంచి సువర్ణావకాశం అని చెబుతున్నారు.
అంతేకాదు.. కొన్ని సంవత్సరాల క్రితం కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు వెళ్లాలంటే అబ్బో దూరం అనుకునేవారు. మేడ్చల్, ఈసీఐఎల్, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, కొండాపూర్, ఆరాంఘర్ చౌరస్తా, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాలకు వెళ్లడం కూడా ఎంతో కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడవి మినీ టౌన్‌లుగా మారాయి. అదే విధంగా.. ఒకప్పుడు అబిడ్స్‌కు వచ్చి షాపింగ్ చేసే నగరవాసులు.. ఇప్పుడు నగరం విస్తరించడంతో ఎక్కడివారు అక్కడే షాపింగ్ చేస్తున్నారు. అంతలా ఆయా ప్రాంతాలు డెవలప్ అయ్యాయి. అంతేకాదు.. భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఉందని సూచిస్తున్నారు రియల్‌ఎస్టేట్ రంగం నిపుణులు. ఇందుకు ప్రజారవాణా కీలకం కాబోతోందంటున్నారు.
గజం భూమి అక్షరాలా రూ.20 లక్షలు - హైదరాబాద్‌లోనే కానీ, మీరనుకుంటున్న చోట మాత్రం కాదు!
దగ్గరవుతున్న దూరం :
- ఎంఎంటీఎస్ మొదటి దశలో 45 కి.మీ. పరిధి అయితే.. రెండోదశ 95 కి.మీ.మేర విస్తరించింది. ఓఆర్‌ఆర్ దాటి ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రీజనల్ రింగురోడ్డు హద్దుగా నగర విస్తరణ జరుగుతోంది.
- ఒకప్పుడు నగరానికి పడమర వైపు లింగంపల్లి వరకే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలు తెల్లాపూర్ వరకు విస్తరించాయి. అదేవిధంగా ఓఆర్‌ఆర్‌కు 4 కి.మీ. దూరంలో ఉన్న కొల్లూరు రైల్వే స్టేషన్‌కు, తర్వాత శంకరపల్లి, వికారాబాద్ వరకూ విస్తరించే ప్రణాళికలు హెచ్‌ఎండీఏ వద్ద ఉన్నాయి. ఇప్పుడున్న రెండు రైల్వే లైన్లకు అదనంగా.. ఎంఎంటీఎస్‌ల కోసం ప్రత్యేకంగా లైన్లు కేటాయించే ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది.
- అలాగే.. నగరానికి తూర్పు వైపు చర్లపల్లి తర్వాత ఘట్‌కేసర్ వరకూ ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. తర్వాత దశలో యాదాద్రి వరకూ నడపాలని సర్కార్ నిర్ణయించింది. ఉత్తరం వైపు మేడ్చల్ వరకూ ఉన్న ఈ సర్వీసులను మనోహరాబాద్ వరకూ పెంచాలనే ఆలోచన చేస్తోంది.
- ఇప్పటికే దక్షిణం వైపు పాతబస్తీని దాటి విమానాశ్రయానికి చేరువుగా ఉందానగర్ వరకూ ఎంఎంటీఎస్‌లు నడుస్తున్నాయి.
- అదే విధంగా.. మెట్రో రైలు(Metro Train) కూడా శంషాబాద్ వరకూ, ఇటువైపు పటాన్‌చెరు, తూర్పు దిక్కున హయత్‌నగర్ వరకూ పొడిగించాలనే ప్రతిపాదనలున్నాయి.
- ఇప్పుడివన్నీ నగర శివార్లలోని నివాస ప్రాంతాల విస్తరణకు దోహదం చేస్తున్నాయని రియల్‌ఎస్టేట్ రంగం నిపుణులు అంటున్నారు. కాబట్టి నగరంలో భవిష్యత్తు అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే ఫ్యూచర్లో ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ స్కామ్స్ నుంచి సేఫ్‌గా ఉండాలా? ఈ టిప్స్ పాటించాల్సిందే!