Beer Bottle is the Key Evidence in Double Murder Case : పగిలిన మద్యం సీసా ఓ హంతకుడిని పట్టించింది. దాదాపు 20 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఓ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. నగర శివారు కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధి కొత్తగూడలోని మామిడి తోటలో ఈ నెల 15న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా, ఇతడి నేపథ్యం గురించి ఆరా తీస్తున్న క్రమంలో 2023 మార్చిలోనూ ఓ మహిళను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును ఛేదించడానికి పగిలిన మద్యం సీసా మీద వేలి ముద్రలు కీలకంగా మారడం గమనార్హం. పోలీసులు వీటిని భద్రపరిచి, ఏడాదిన్నర తర్వాత నిందితుడి వేలి ముద్రలతో తనిఖీ చేయడంతో అసలు గుట్టు బయటపడింది. మద్యం సీసాపై వేలి ముద్రల ఆధారంగా హత్య కేసు నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు.
Couble Murder Case In Farm House : ఏపీలోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలానికి చెందిన చెంచు శైలజా రెడ్డి (42) భర్త కృష్ణారెడ్డి, ఇద్దరు పిల్లలతో కలిసి 2011లో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరుకు వచ్చి దాసర్లపల్లిలోని అరుణ ఫామ్ హౌస్‌లో పని చేస్తున్నారు. 2023 మార్చి 3న కృష్ణారెడ్డి, పిల్లలు బయటకు వెళ్లగా, శైలజారెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. అప్పటికే ఆమెపై కన్నేసిన దాసర్లపల్లికి చెందిన ఉప్పుల శివ కుమార్, ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆమెను బలవంతం చేయబోగా ఎదురు తిరిగింది.
దీంతో కత్తితో ఆ మహిళను నరికి చంపాడు. ఆ తర్వాత పక్కనే మద్యం సీసా కనిపించగా, తాగేందుకు ప్రయత్నించాడు. సీసా చేజారి కింద పడి పగిలిపోయింది. దానిపై నిందితుడి వేలిముద్రలు పడ్డాయి. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. వేలిముద్రలు మినహా ఘటనా స్థలిలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభ్యమవ్వలేదు. ఎప్పటికైనా నిందితుడు చిక్కుతాడనే ఉద్దేశంతో పోలీసులు మద్యం సీసా మీద వేలిముద్రలు తీసి భద్రపరిచారు.
వృద్ధ దంపతుల హత్య కేసు : తాజాగా కొత్తగూడ మామిడితోటలో వృద్ధ దంపతుల హత్య కేసులో శివకుమార్ నిందితుడని పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్టు చేశారు. ఇక్కడ సేకరించిన వేలిముద్రలను, శైలజా రెడ్డి హత్య కేసులో నమోదైన వేలి ముద్రలు రెండింటినీ పోల్చి చూడగా సరిపోలాయి. దీంతో పోలీసులు రెండు కేసుల్లోనూ నిందితుడి శివకుమారే అని నిర్ధారించారు.
ఎవరు చంపుతున్నారు? - ఎందుకు చంపేస్తున్నారు? - అసలు ఆ హత్యలు చేస్తుందెవరు?