Beauty Parlor Fraud in Kukatpally : ఆడవాళ్లకి అందంపై మక్కువ ఎక్కువ. మేకప్ కోసం అస్సలు డబ్బులకు వెనుకాడరు. బ్యూటీ పార్లర్ బిజినెస్ ఎప్పుడూ కాసుల గలగలే అంటూ ప్రకటనలు వేయించారు. చిన్న మొత్తంలో పెట్టుబడితో జీవితాంతం డబ్బులు సంపాదించే అద్భుతమైన అవకాశమని ఆశ పుట్టించారు. నెలనెల జీతం ఇవ్వడంతో పాటు అదనంగా మరిన్ని డబ్బులు వస్తాయంటూ ఊదరగొట్టారు.
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు - సీవీ ఆనంద్ పేరుతో ఫేక్ అకౌంట్
బ్యూటీ పార్లర్ ప్రాంఛైజీ(Rose Gold Beauty Parlor) పేరుతో ఆ కిలాడి ఫ్యామిలీ డబ్బులు దండుకుంది. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ ప్రాంఛైజీ పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూళ్లు చేసి పరారయ్యారు. ఈ ఘరానా మోసం ఇవాళే వెలుగులోకి వచ్చింది. అమాయకులకు వల వేసేందుకు యూట్యూబ్ ఛానెళ్లతో యాడ్స్ చేసి మరీ కస్టమర్లను ఆకర్షించారు. ఇదంతా నిజమని నమ్మిన బాధితులు పుస్తెలతాళ్లు అమ్మిమరి పెట్టుబడులు పెట్టారు. చివరకు రోడ్డున పడ్డారు.
Rose Gold Beauty Parlor Fraud : తమిళనాడుకు చెందిన షేక్ ఇస్మాయిల్, భార్య సమీనా అలియాస్ ప్రియాంక అలియాస్ ప్రేమకుమారిలు నగరానికి ఉపాధి కోసం వచ్చారు. నిజాంపేటలోని ప్రగతినగర్ నెమలి బొమ్మల చౌరస్తాలో రెండేళ్ల క్రితం ‘రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్’ ఏర్పాటు చేశారు. దంపతులతో పాటు సమీనా చెల్లెలు దేవకుమారి అలియాస్ జెస్సికా, సోదరుడు రవి అలియాస్ చిన్నా బ్యూటీ పార్లర్ యజమానులుగా వ్యవహరించేవారు. వీరితో పాటు నగరానికి చెందిన విశ్వతేజ అనే మరో వ్యక్తిని ఉద్యోగిగా చేర్చుకున్నారు.
సోషల్ మీడియాతో బీకేర్‌ఫుల్ అమ్మాయిలూ - ప్రొఫైల్ లాక్ లేకపోతే ఈ చిక్కుల్లో పడ్డట్లే
కొన్నాళ్లు స్థానికులతో విస్తృతంగా పరిచయాలు పెంచుకున్న ఇస్మాయిల్, సమీనా డబ్బు కొట్టేసేందుకు పథకం వేశారు. బ్యూటీ పార్లర్ విభాగంలో తమ రోజ్ గోల్డ్ సంస్థకు మంచి పేరుందని, ఆసక్తి ఉన్న మహిళలకు బ్యూటీ పార్లర్ ప్రాంఛైజ్ ఇచ్చి అవసరమైన సరకులు ఇవ్వడంతో పాటు నెలకు రూ.35 వేలు వేతనం ఇస్తామని ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటలు ఇస్తూ అందర్నీ నమ్మించారు. ఇది నిజమేనని భావించిన నిజాంపేట వాసులతో పాటు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి వందలాది మంది ఫోన్‌లో సంప్రదించారు. ప్రాంఛైజీ ఇవ్వడానికి సుమారు 200 మంది నుంచి రూ.3 నుంచి రూ.5 లక్షల దాకా వసూళ్లు చేశారు.
ప్రాంఛైజీకి స్థలం, దుకాణం సమకూర్చుకోవాలని చెప్పారు. 2023 జనవరి నుంచి అందినకాడికి డబ్బు వసూలు చేసి, కొందరికి నెలవారీగా జీతాలు ఇచ్చి నమ్మించారు. గతేడాది సెప్టెంబరు వరకూ ప్రాంఛైజీ ఇస్తామని సాగదీశారు. ప్రతిసారీ దాటవేయడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. బాధితుల్లో కొందరు రెండు రోజుల క్రితం ప్రగతినగర్‌లోని కార్యాలయానికి వచ్చి చూడగా బోర్డు తొలగించి ఉంది. ఇరుగుపొరుగును ఆరాతీయగా నెల రోజుల క్రితమే ఖాళీ చేసి పరారైనట్లు తెలుసుకున్నారు.
బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. దేవకుమారితో పాటు ఉద్యోగి అయిన విశ్వతేజలను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా ప్రధాన సూత్రధారులైన దంపతులు పరారీలో ఉన్నట్లు బాచుపల్లి ఎస్సై బి.మహేష్‌గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా శంకరంపేట ఠాణాలోనూ నిందితులపై సోమవారం మరో కేసు నమోదైంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
మ్యాట్రిమోనిలో అతివలకు వల - షాదీ.కామ్‌లో నకిలీ డాక్టర్ నయా మోసం