Bathukamma Celebrations In Snow : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు అందమైన బతుకమ్మలను పేర్చి చుట్టూ చేరి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించుకుంటున్నారు. హైదరాబాద్‌లోనూ బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. శుక్రవారం కొండాపూర్‌లో జరిగిన బతుకమ్మ వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి. స్థానిక ఏఎమ్ఆర్ మాల్లోని ఐదో ఫ్లోర్లో ప్రత్యేకంగా మంచులో బతుకమ్మ దాండియా ఆడే విధంగా ఏర్పాటు చేసిన సెట్ అందరినీ ఆకట్టుకుంది.
మంచులో బతుకమ్మ దాండియా నృత్యాలు : బతుకమ్మ సంబురాల్లో భాగంగా కొండాపూర్‌లో వినూత్న రీతిలో యువతులు మంచులో దాండియా ఆడుతూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. దసరా ఉత్సావాలను పురస్కరించుకుని ఏఎంబీ మాల్ ఐదో ఫ్లోర్లో మంచులో బతుకమ్మ దాండియా ఆడే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు, యువతులు పాల్గొన్నారు.
బతుకమ్మ పాటలు తమను మంత్రముగ్ధుల్ని చేశాయని తెలిపారు. మంచులో బతుకమ్మ ఆలోచన కొత్తగా అనిపించడంతో ఇక్కడకి వచ్చినట్లుగా పాల్గొన్న వారు తెలిపారు. బతుకమ్మ పాటల్లో నృత్యం చేయడం ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. దాండియా పాటలతో చాలా ఎంజాయ్ చేశామని ఆనందం వ్యక్తం చేశారు.
"నేను ఏఎంబీ మాల్లోని స్నో కింగ్డమ్కు వచ్చాను. దసరా బతుకమ్మ సంబురాలు జరుగుతున్నాయనగానే మంచులో దాండియా ఆడితే ఎలా ఉంటుందనే ఆసక్తితో ఇక్కడకు వచ్చాను. నాతో పాటు నా ఫ్రెండ్స్‌ను కూడా తీసుకొచ్చాను. ఎక్కడెక్కడకో వెళ్లి స్నో ఎక్స్పీరియన్స్ చేద్దామనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్. ఇక్కడ దాండియా కార్యక్రమం చాలా బాగా జరిగింది"- యువతి
హైదరాబాద్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు : హైదరాబాద్ నారాయణగూడ, సనత్‌నగర్, కూకట్‌పల్లి కళాశాలల్లో బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగాయి. యువతులు సంప్రదాయ వస్త్రాల్లో బతుకమ్మ ఆడుతూ సందడిచేశారు. ఉస్మానియాయూనివర్సిటీలో విద్యార్థినిలు, ప్రొఫెసర్లు కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థినిలు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బతుకమ్మ పండుగే క్రియాశీలక పాత్ర పోషించిందని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో బతుకమ్మవేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలుతీరోక్క పూలతో గౌరమ్మలను పేర్చి ఆటపాటలతో అలరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఆవరణలో వేడుకలు ఘనంగా సాగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి పండుగ నిదర్శనమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌లోని వాసవిమాత ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
Uganda Bathukamma Festival Celebrations : ఎల్లలు దాటిన బతుకమ్మ.. ఉగాండాలో సందడిగా బతుకమ్మ వేడుకలు