Bathukamma Celebrations in Singapore : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు సంప్రదాయ పాటలు, ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 4 వేల నుంచి 5 వేల వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు.
సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరికీ, స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, దశాబ్దానికి పైగా సింగపూర్‌లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోతుందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ, ఉత్తమ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలకు గృహ ప్రవేశ్, సౌజన్య డెకార్స్, ఎల్వైఎస్ జువెల్స్, బీఎస్కే కలెక్షన్స్ వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరం అని టీసీఎస్ఎస్ సభ్యులు తెలిపారు. వేడుక విజయవంతంగా జరగడానికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీసీఎస్ఎస్తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందనీయం అని సంతోషం వ్యక్తం చేశారు.
వేడుకల్లో టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాటను యూట్యూబ్‌లో విడుదల చేసినప్పటి నుంచి వేల వీక్షణలతో దూసుకుపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ మొదలగు వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ వేడుకలను సొసైటీ ఫేస్బుక్, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశామని సొసైటీ వారు వెల్లడించారు.
ఐర్లాండ్‌లో తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
తెలంగాణ పూల సంబురం - 'బతుకమ్మ' విశిష్టత ఏమిటో మీకు తెలుసా? - Bathukamma Festival 2024