Bangalore Rave Party Latest News : బెంగళూరులోని నగర శివారు ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. ఈ విషయంపై బెంగళూరు సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో తెలుగు సహాయ నటి హైమ కూడా పాల్గొన్నారని చెప్పారు. అయితే ప్రజాప్రతినిధుల ప్రమేయం మాత్రం లేదని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ మాట్లాడుతూ సీసీబీ పోలీసులు, స్థానిక పోలీసులు నగర శివారు ప్రాంతంలో పార్టీ జరుగుతుందని తెలిసి దాడులు నిర్వహించారని తెలిపారు. మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు శిక్షణ పొందిన డాగ్ స్వ్కాడ్ సహాయం తీసుకున్నట్లు వివరించారు. ఈ పార్టీలో వంద మందికి పైగా పాల్గొన్నారు. ఈ దాడిలో మత్తు పదార్థాలను గుర్తించామన్నారు. కొందరు తాము వాడుతున్న డ్రగ్స్‌ను స్విమ్మింగ్ పూల్తో పాటు ఇతర ప్రాంతాల్లో విసిరేశారని వెల్లడించారు.
ఈ సంఘటనకు సంబంధించి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ సంఘటన స్థలం బెంగళూరు రూరల్‌లోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడకు బదిలీ చేస్తామని బెంగళూరు నగర కమిషనర్ దయానంద్ తెలిపారు.
నటి హేమ వీడియోపై దర్యాప్తు : ఆ పార్టీలో తాను లేనని సహాయ నటి హేమ సోమవారం ఒక వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి ఆమె తీశారో తెలియడం లేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ అన్నారు. ఈ విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అలాగే పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలమన్నారు. అందుకు సంబంధించిన నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు.
"మే 19 రాత్రి బెంగళూరు పోలీసులు, సీసీబీ నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. దాదాపు 100 మంది వ్యక్తులు ఆ కార్యక్రమంలో ఉన్నారు. అందులో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు దొరికాయి. కేసు నమోదు చేశాం. ఐదుగురిని అరెస్టు చేశాం. హాజరైన వారి రక్త నమూనాలు సేకరించాం. మేము ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. పార్టీకి హాజరైన వారిలో ఎక్కువ మంది బయట నుంచి వచ్చినవారే. ఎవరూ ప్రజాప్రతినిధులు లేరు. అక్కడ ఒక నటిని గుర్తించాం." - దయానంద, బెంగళూరు నగర పోలీసు కమిషనర్
అసలేం జరిగింది : ఓ ప్రముఖ వ్యాపారవేత్త బెంగళూరు శివారు ప్రాంతంలో ఇచ్చిన రేవ్ పార్టీలో ఏపీ, బెంగళూరుకు చెందిన వంద మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం పోలీసులు తెలుసుకుని పార్టీపై దాడి చేశారు. ఈ దాడిలో తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నారు. అలాగే రేవ్ పార్టీలో పోలీసులు డ్రగ్స్ గుర్తించారు.
17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన లాంటి మత్తు పదార్థాలను పోలీసులు గుర్తించారు. అలాగే మెర్సిడెస్ బెంజ్, ఆడీ, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటుడు శ్రీకాంత్, సహాయ నటి హేమ పేర్లు మార్మోగిపోయాయి. అయితే ఆ వార్తను వారు ఖండిస్తూ ఇంట్లోనే ఉన్నట్లు ఉన్న వీడియో ఫుటేజీలను విడుదల చేశారు. అయితే హేమ విషయంలో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఆమె పార్టీలో ఉన్నట్లు తాజాగా చెప్పారు.
బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన నటీనటులు శ్రీకాంత్, హేమ - Actor Hema Reacts on Rave Party