Balineni and Samineni Udayabhanu met Pawan Kalyan: జగన్‌కు తమ పార్టీ నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా బాలినేని, సామినేని ఉదయభాను వైఎస్సార్సీపీకి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఇరువురు ఒకరితరువాత ఒకరు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.
పవన్ ఏం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నా: వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. గంటకు పైగా అన్ని అంశాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. పవన్‌తో భేటీ అనంతరం బాలినేని మాట్లాడుతూ విశ్వసనీయత గురించి పదేపదే మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి అసలు విశ్వసనీయత లేదని అన్నారు.
జగన్ కోసం మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 17మంది పట్ల జగన్ ఎలాంటి విశ్వాసం చూపించారో చెప్పాలన్నారు. వైసీపీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీలో కొనసాగానన్నారు. పవన్ కల్యాణ్నా గురించి బహిరంగ సభల్లో మంచిగా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. పవన్ ఏం చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నానని కూటమిలోని మూడు పార్టీల నేతలను కలుపుకుని వెళతానని తెలిపారు. త్వరలోనే ఒంగోలులో సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చాలామంది నేతలు, కార్యకర్తలు చేరతారని వివరించారు.
ఐ ఫోన్లు ఓపెన్ కాకపోవడంతో డేటా డిలీట్ చేయాలని చూశారు: ముంబయి నటి - Mumbai Actress Meet Home Minister
జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డా: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉదయభాను పవన్‌ను కలిశారు. ఈ క్రమంలో సామినేని మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. మనసుకు కష్టం కలిగినందునే పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. జగన్‌ను అనేకసార్లు కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు.
పరిణామాలు చూస్తే వైఎస్సార్సీపీకి భవిష్యత్తు కనిపించట్లేదని అన్నారు. భవిష్యత్తు చూసుకోవాలనే తామంతా బయటకు వచ్చినట్లు ఉదయభాను తెలిపారు. పవన్ కల్యాణ్‌ను కలిసి అన్ని విషయాలు చర్చించినట్లు వివరించారు. ఈ నెల 22న తన అనుచరులతో కలిసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధమని సామినేని ఉదయభాను తెలిపారు. వైఎస్‌తో ఎంతో సన్నిహితంగా పని చేశానని అదే కమిట్మెంట్తో వైఎస్సార్సీపీలో చేరినా జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డానని వివరించారు.