New Rules for Balapur Laddu Auction : బాలాపూర్లో బుజ్జి గణపయ్య అందరిని ఆకర్షిస్తున్నాడు. ఈసారి అయోధ్య రామ మందిర తరహా సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయోధ్య రామాలయ శైలికి తీసి పోకుండా అద్భుతమైన సెట్ ఏర్పాటు చేసారు. ఎదురుగా రాంలల్లా విగ్రహం పక్కనే ఆంజనేయ విగ్రహం పిల్లర్లపై స్థపతిలు చెక్కినట్టుగా ఉన్న శిల్పాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. రామాయణ కావ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే కొన్ని ఫొటోలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శిస్తున్నారు.
భక్తుల సందడి : భక్తులు బాలాపూర్ మండపాన్ని చూసి మురిసిపోతున్నారు. ఇక వినాయకుడి విగ్రహాన్ని చూస్తే దేవ దానవులు ఆది కూర్మంపై సముద్రాన్ని చిలికిన ఘట్టాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కన్పిస్తుంది. వాస్తవంగా మందర గిరి, వాసుకి, దేవతలు, రాక్షసులు కనిపించేలా అవతారాలు ఉన్నాయి. అలాగే గణేశుడి క్షణానికోసారి కళ్లు ఆర్పుతూ ఉండడం బాలాపూర్ ప్రత్యేకత సంతరించుకుంది. గత రాత్రి తొలిపూజ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించిన పూజారులు, నవరాత్రులు గణపతి నిత్యపూజలు అందుకుంటాడని చెబుతున్నారు.
ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు భారీగా తరలివస్తున్న దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా మండపాన్ని నిర్మించారు. పోలీసులు భక్తులను తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. భక్తులకు మౌలిక సదుపాయాలను సైతం కల్పించారు. గతంతో పోలిస్తే ఈ సారి లడ్డూ వేలంపాట కూడా మారినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
లడ్డూ వేలం పాటకు నిబంధనలివే : గత సంవత్సరం బాలాపూర్ లడ్డు ధర రూ. 27 లక్షలు పలికింది. ఈ సంవత్సరం లడ్డూ వేలంలో పాల్గొనాలంటే ఉత్సవ సమితి సూచించిన సొమ్మును డిపాజిట్ చేయాలని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం రూ. 27 లక్షలు డిపాజిట్ చేస్తేనే లడ్డూ వేలంపాటకు అర్హత ఉంటుందని చెబుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడు తమకు కటాక్షం ఇవ్వాలని భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. నవరాత్రులు బాలాపూర్ గణేశ్ అంటే ఇక నుంచి లడ్డు మాత్రమే కాదు, ప్రతిసారి ప్రత్యేకమైన సెట్ ఒకటి ఉంటుంది. అది జనాల దృష్టిని ఆకరించేలా ఉంటుందని ఈసారి నిర్మించిన అయోధ్య సెట్ స్పష్టం చేస్తోంది.