AWBI Guidelines on Street Dogs Bite Precautions : హైదరాబాద్ మహానగరంలో వీధికుక్కల చెలగాటం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. జీహెచ్ఎంసీ గణాంకాల ప్రకారం నగరంలో సమారు 6 లక్షలపైగా వీధి శునకాలు ఉంటాయి. సాధారణంగా ఒక కుక్క ఏడాదికి 2 సార్లు సంతానోత్పత్తి చేస్తుంది. దీంతో వీధికుక్కల సంఖ్య సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా(AWBI) మార్గదర్శకాల ప్రకారం బల్దియా వెటర్నరీ విభాగం ప్రతి కుక్కను పట్టుకొని రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయించాలి. కానీ ఆచరణలో అది అమలు కాకపోవడంతో సామాన్య ప్రజలు కుక్కకాట్లకు బలవుతున్నారు. బల్దియాలో రోజుకు వీధి కుక్కల సమస్యలపై 500 ఫిర్యాదులు అందుతుంటే వాటిలో 10% కూడా పరిష్కరించడం లేదనే ఆరోపణలున్నాయి.
నగరంలో వీధి శునకాలు పసిపిల్లలను, పాఠశాల విద్యార్థులను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అంబర్‌పేట్‌లో వీధి శునకాల దాడిలో పిల్లాడు చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘటన జీహెచ్ఎంసీ(GHMC)తో పాటు ప్రభుత్వంపై కూడా రాజకీయంగా విమర్శలకు కారణమైంది. ఇది జరిగి ఏడాది గడవక ముందే షేక్‌పేటలో మరో విషాధకర సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయ పర్చడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కళ్లముందే కుమారుడు చనిపోవడంతో ఆ బాధ తట్టుకోలేని కుటుంబం నగరాన్ని విడిచి స్వగ్రామానికి వెళ్లిపోయింది.
కుక్క కరిచిందా - ఇలా చేయకపోతే మీకు ప్రాణాపాయం తప్పదు!
Experts Suggestions on Street Dogs Bite : అంబర్‌పేట ఘటనపై స్పందించిన మున్సిపల్ శాఖ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం మంజూరు చేసింది. నగర మేయర్ విజయలక్ష్మితో పాటు కార్పొరేటర్ల జీతాల నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని నగరంలో కుక్కల బెడదను నివారించేందుకు 13 అంశాలతో ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది. కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియ(Sterilization Procedure for Dogs)ను వేగవంతం చేయడంతో పాటు నగర వ్యాప్తంగా కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కుక్క కాటు ఘటనలను నియంత్రించాలని ఆదేశించింది. మాంసం విక్రయదుకాణాలు, హోటళ్ల వ్యర్థాలను రోడ్లపై వేయకుండా చూడాలని సూచించింది. కుక్కల స్వభావంపై స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
యానిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు : నగరంలోని అన్ని పాఠశాలల్లో వీది కుక్కల(Street Dogs Attack) పట్ల ఎలా వ్యవహారించాలో విద్యార్థులకు వివరించాలని తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2025 నాటికి నగరాన్ని రేబిస్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రేటర్‌లోని అన్ని పార్టీల నుంచి ఇద్దరు కార్పొరేటర్ల చొప్పున 8 మందితో ప్రత్యేకంగా హైలెవల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకొని 5 జోన్లలో 5 యానిమల్ కేర్ సెంటర్ల(Animal Care Centers)ను ఏర్పాటు చేసింది. అందులో ఫతుల్లాగూడ, చుడిబజార్, పటేల్‌నగర్, కూకట్‌పల్లి హౌజింగ్‌బోర్డు కాలనీ, మహాదేవ్ పూర్‌లో యానిమల్‌కేర్ సెంటర్లలో వీధి శునకాలకు రేబిస్ టీకాలు ఇవ్వడం, సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు.
Street Dogs Bite Cases in Hyderabad : హైదరాబాద్‌లోని మణికొండ, షేక్‌పేట, మెహదీపట్నం, కార్వాన్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌తో పాటు అల్వాల్, ఎల్బీనగర్, ఉప్పల్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, మణికొండ ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. హయత్‌నగర్, మూసీనది పరివాహక ప్రాంతాల్లో స్టెరిలైజ్ చేయని వీధి శునకాలు ఎక్కువగా కనిపిస్తాయి. నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోవడానికి ప్రధానంగా వాటిని నియంత్రించలేక పోవడం ఒక కారణమైతే పారిశుద్ధ్య సమస్య కూడా మరో కారణంగా మారింది. చాలాచోట్ల చెత్త కుప్పలు పెరుగుతుండటంతో వీధి కుక్కలు అందులోని కుల్లిపోయిన ఆహారాన్ని తింటూ అనారోగ్యాల బారినపడుతున్నాయి. దాంతో అటువైపుగా వెళ్లే వారిపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొందరు చిన్నారులు మృత్యువాత పడుతుండగా మరికొందరు చికిత్సతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నారు.
హైదరాబాద్‌లో విషాదం - కుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల బాలుడు మృతి
జీహెచ్ఎంసీ గణాంకాల ప్రకారం గతేడాది 40,155 శునకాలను స్టెరిలైజ్ చేశారు. కూకట్ పల్లి, ఫతుల్లాగూడలోని కేంద్రాల్లో రోజుకు 40 నుంచి 100 శునకాలకు సంతాన నిరోధక చికిత్సలు చేస్తున్నారు. చికిత్స పూర్తైన కుక్కలను 5 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో పెట్టి ఆ తర్వాత వాటిని తీసుకొచ్చిన ప్రదేశంలోనే వదిలిపెడుతున్నారు. ఇందుకోసం ఒక్కో శునకానికి రూ.1500 నుంచి రూ.1800 ఖర్చవుతోంది. ఈ లెక్కన నగరంలో ఉన్న కుక్కలన్నింటికి స్టెరిలైజ్ చేయాలంటే కోట్లాది రూపాయలు అవసరం. ఆ నిధులు జీహెచ్ఎంసీ వద్ద తగినంత లేకపోవడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అలాగే జీహెచ్ఎంసీలో 32 మంది వెటర్నరీ అధికారులు ఉండాల్సిన చోట 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
Street Dog Issue in Telangana : వీధి కుక్కలను పట్టుకునేందుకు సర్కిల్‌కు కనీసం 60 వాహనాలు ఉండాలి. కానీ, 14 వాహనాలు మాత్రమే శాశ్వతంగా అందుబాటులో ఉన్నాయి. మరో 36 వాహనాలను అద్దె ప్రాతిపాదికన తీసుకొని కుక్కలను పట్టుకుంటున్నారు. మరోవైపు యానిమల్ కేర్ సెంటర్లలో సరైన మౌలిక వసతులు లేవు. శస్త్ర చికిత్సకు కావల్సిన అధునాతన పరికరాలు లేకపోవడంతో వైద్యులు వీధి శునకాలకు స్టెరిలైజ్ చేయలేకపోతున్నారు. దీంతో పాటు ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నుంచి వచ్చే మాంసాహార వ్యర్థాలను కట్టడి చేయడంలో జీహెచ్ఎంసీ విఫలమవుతోంది. వేసవిలో శునకాలకు తాగునీరు అందించే వాటర్ బౌల్స్ ఏర్పాటు చేయకపోవడంతో వీధి శునకాల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇవి వీధి కుక్కలు క్రూరంగా మారడానికి కారణాలవుతున్నాయి.
దిల్‌సుఖ్‌నగర్‌లో ఐదేళ్ల బాలుడిపై కుక్క దాడి - సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలు
జీహెచ్ఎంసీలోని వెటర్నరీ విభాగంలో వైద్యులతో పాటు ఏడబ్లూబీఐ అనుమతి ఉన్న ఐదారు స్వచ్ఛంద సంస్థలు నిరంతరం వీధి శునకాలకు స్టెరిలైజేషన్ చేస్తున్నాయి. వాటి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. చెవి వద్ద వీ ఆకారంలో కట్ చేసిన శునకాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అనుమానాస్పదంగా కనిపించే వీధి శునకాలపై ఫిర్యాదు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు కూడా వీధి శునకాలపై ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కుక్కల్లో రెండు రకాలైన రేబిస్ లక్షణాలుంటాయని చెబుతున్నారు.
- మొదటిది డంబ్ రేబిస్. ఇది సోకితే కుక్క శరీరంలోని నరాలు బలహీనం అవుతాయి. అది కదల్లేక ఎప్పుడూ ఒక దగ్గరే కూర్చొని ఉంటుంది. తర్వాత పక్షవాతంతో నాలుగు రోజుల్లోనే చనిపోతుంది.
- రెండోది ఫ్యూరియస్ రేబిస్. ఇది సోకితే కుక్క మరణించడానికి పది రోజులు పడుతుంది. ఈ సమయంలో అది మరింత కోపంగా, దూకుడుగా ప్రవర్తిస్తుంది. లాలాజలం మింగలేకపోతుంది. గొంతులోని నరాలు పక్షవాతానికి గురవుతాయి. అనారోగ్యంతో మరింత కలతకు గురై కరవడం మొదలుపెడుతుంది.
కరిచిన రోజునే దానికి రేబిస్ సోకినట్లుగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మేలని వైద్యులు చెబుతున్నారు. అలాంటి శునకాలను ముందే గుర్తించి సమాచారం విధికుక్కల ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలను కూడా కాపాడవచ్చని చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వీధి శునకాలను చంపడం నేరం. సమాజంలో వాటికి కూడా బతికే హక్కు ఉండటంతో సరైన చికిత్స అందించాలని ఆదేశించింది. ఈ మేరకు ఏడబ్లూబీఐ గతేడాది కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలకు సంబంధించిన ఘటనలు అదుపు తప్పుతుండటంతో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం-1960 ప్రకారం జంతు జనన నియంత్రణ నియమాలు 2023ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
'కుక్క కరిస్తే రూ.20వేలు పరిహారం'- రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశం