Awareness On 10 Rupees Coin : పది రూపాయల నాణెం చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి, అన్ని వర్గాలతో వాడకంలోకి తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అటు దుకాణదారులు, ఇటు వినియోగదారులకు నమ్మకాన్ని కలిగించి వాటి చలామణి పెంచేందుకు వీలుగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ప్రచారాన్ని ప్రారంభించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో నాణేల చట్టబద్ధతపై అవగాహనపై విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
చిల్లర డబ్బుల కొరత : చిల్లర డబ్బుల చలామణి సాధారణంగా కూరగాయల మార్కెట్లు, చిరు వ్యాపారులు, పాన్ దుకాణాలు, చిన్న చిన్న హోటళ్లు, కిరాణా దుకాణాల్లో ఎక్కువగా సాగుతుంటాయి. పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావన్న అపోహ ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయింది. దీని కారణం పల్లెల్లో, పట్టణాల్లో కూడా వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో చిరిగిన, నలిగిపోయిన నోట్లే తీసుకుంటున్నారు తప్ప పది రూపాయల నాణాలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో మార్కెట్లో చిల్లర నగదు కొరత తీవ్రంగా మారింది.
అవగాహన కోసం ఏం చేస్తున్నారంటే : బ్యాంకు పరిధిలోని మార్కెట్లు, దుకాణాలు, రైతు బజార్‌లు, ప్రధాన మంత్రి స్వనిధి లబ్ధిదారులను కలిసి వారికి పది రూపాయల నాణెం చలామణికి సంబంధించిన చట్టబద్ధతపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ నెల 15వ తేదీన(మంగళవారం) కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బ్యాంకు సిబ్బంది తమ కరెన్సీ చెస్ట్ నుంచి కనీసం పది నాణేలు తీసుకుని వాటిని అన్ని వర్గాలకు పంపిణీ చేసి చలామణిలోకి తీసుకొచ్చేలా ప్రచారం చేస్తున్నారు.
తర్వాత రోజుల్లో బ్యాంకులో ఏదైనా లావాదేవీల సందర్భంగా ప్రతి వినియోగదారుడికి నగదు చెల్లింపుల చెల్లింపులలో నిర్ణీత మొత్తంలో పది రూపాయల నాణేలు అందజేయనున్నారు. దీంతో మార్కెట్లో చిల్లర సమస్య తొలగుతుందని అధికారులు చెబుతున్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పది రూపాయల నాణేలను 2005 లో తొలిసారిగా ముద్రణ చేపట్టింది. 2019 వరకు వివిధ సందర్భాలను బట్టి 14 సార్లు ఇవి విడుదలయ్యాయి.
చలామణి నిలిచిపోవడం : అన్ని రకాల నాణేలు చెల్లుబాటులో అవుతాయని రిజర్వు బ్యాంకు పలుమార్లు స్పష్టం చేసినా వాటి చలామణి మాత్రం దాదాపుగా నిలిచిపోయింది. అవగాహన ఉన్న కొందరు వాటిని వాడుదామనుకున్నా ఎదుటి వ్యక్తులు వాటిని తీసుకోకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో వాటి వాడకం నిలిచిపోయింది.
పది రూపాయల నోట్లు మార్కెట్లో ఉన్నప్పటికీ చేతులు మారేకొద్దీ అవి చిరిగి పనికి రాకుండా పోతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వు బ్యాంకు పది రూపాయల నాణేలు ముద్రిస్తున్నా వాటి చలామణి నిలిచిపోవడం సమస్యగా మారింది. పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావనేది అపోహ మాత్రమే. గతంలో పలుమార్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నాణేల చట్టబద్ధతపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా పది రూపాయల నాణేలు తీసుకోవడానికి నిరాకరిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని తెలిపింది.
'పది రూపాయల నాణెం చెల్లుతుంది - కాదంటే శిక్ష తప్పదు' - ఆర్బీఐ - Awareness On Ten Rupees Coin
ఆ పది రూపాయలు వద్దంటే మూడేళ్లు జైలుకే!- ఆర్బీఐ తాజా ప్రకటన ఇదే - Indian Currency Coins