Fake RTO Case in Hyderabad : హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నకిలీ ఆర్టీవోల దందా అక్కడి పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే నకిలీ ఆర్టీవోల దందా మొదలవుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఉదయం 7గంటల లోపు ముగించుకుంటారు. గురువారం (నవంబర్ 21 న) నకిలీ ఆర్టీవో ప్రేమ్‌కుమార్ రెడ్డిని బాధితులు పోలీసులకు పట్టించారు.
తప్పించుకు తిరుగుతున్న ఉప్పల్‌లోని సెవెన్‌హిల్స్ కాలనీకి చెందిన సంతోష్‌ను శుక్రవారం (నవంబర్ 22) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ్‌కుమార్‌రెడ్డి ఆటోడ్రైవర్, సంతోష్ అడ్డా కూలీ అని తెలిసి ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. వీరిద్దరూ కలిసి నకిలీ ఆర్టీవోలుగా అవతారమెత్తి అమాయక వాహనదారులను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున దందాకు తెరలేపారు. చివరకు వారే వీరిని పోలీసులకు పట్టించారు. అలాగే వీరికి ఈ దందా మూడు పూలు ఆరు కాయల లాగా బాగా జరిగిందని చూసినవాళ్లు అంటున్నారు.
నకిలీ ఆర్టీవో రోజుకు రూ. 500 కూలీ : నకిలీ ఆర్టీవోల దందాకు ప్రధాన సూత్రధారిగా ప్రేమ్‌కుమార్ రెడ్డి వ్యవహరించినట్లు తెలుస్తోంది. కారులో కూర్చోని ఆర్టీవో పాత్ర సంతోష్ పోషిస్తున్నాడు. రోజూ ఉదయం కారులో సంతోష్‌ను తీసుకొని ప్రేమ్‌కుమార్ రెడ్డి నాగోల్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాలకు వెళ్తాడు. కారులో సంతోష్‌ను కూర్చొబెట్టి అతని వద్ద ఓ ల్యాప్‌టాప్, ఫైన్లు రాయడానికి రశీదు పత్రాలు ఉంచుతాడు. వచ్చిపోయే వాహనాలను ప్రేమ్‌కుమార్ రెడ్డి చూసి ఆపుతూ ఉంటాడు.
కారులో కూర్చొన్న సంతోష్‌ను ఆర్టీవో ఆఫీసర్ అని చూపుతూ వాహనాల తనిఖీ కోసమని వాటి పత్రాలను అడుగుతాడు. ఏదైనా పేపరు లేకుంటే డబ్బు వసూలు చేసేవాడు. సారు దగ్గరకు వెళ్తే ఎక్కువ తీసుకుంటాడని, ఇక్కడైతే తక్కువగానే పుచ్చుకుంటానని ప్రేమ్‌కుమార్ రెడ్డి అడుగుతాడని బాధితులు చెబుతున్నారు. నకిలీ ఆర్టీవోగా నటించిన సంతోష్‌కు రూ.500 కూలీ ఇస్తూ మిగతా మొత్తం నగదును ప్రేమ్‌కుమార్ రెడ్డి తీసుకున్నాడని తెలిసింది.
ప్రేమ్‌కుమార్ రెడ్డి మీద ఎక్కువగా కాంక్రీట్ మిల్లర్ వాహనదారులు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. దాదాపు ఒక సంవత్సర కాలంగా తమను ఆర్టీవో పేరు చెప్పి విపరీతంగా వేధించేవాడని గగ్గోలు పెడుతున్నారు. వీరి అరాచకాలకు దాదాపు 4 వందల మంది బాధితులయ్యారని వాపోయారు.
ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి కాసుల వర్షం- 9999 నంబరుకు రూ.20 లక్షలు
ఐ7 రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీవోకు వచ్చిన అల్లు అర్జున్ - ALLU ARJUN IN RTO OFFICE