Arrangements for Telangana Formation Day Celebrations : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది ట్యాంక్ బండ్‌పై ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. ఈ ప్రాంతమంతా పచ్చదనం పరుచుకునేలా కొత్తగా మొక్కలు నాటడం, పచ్చిక ఏర్పాటు పనులు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలతో ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర అధికారులు పర్యవేక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు కూడా ఉత్సాహంగా తమ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని ఆనందించేందుకు, అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. ఆకట్టుకునే ప్రదర్శనలు, హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, పుడ్ కోర్టులకు కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాల సాంస్కృతిక కళా బృందాలతో కార్నివాల్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
జూన్ 2న జరిగే దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు : జూన్ 2న ఉదయం తొలుత గన్ పార్కులో అమర వీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. వేడుకల్లో సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం పోలీస్ సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేస్తారు.
ఆ తర్వాత సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్‌ను సాయంత్రం వేళ సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. ఆ తర్వాత సుమారు 5 వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్‌పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. అదే సమయంలో పదమూడున్నర నిమిషాల జయ జయహే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు.