Army Recruitment in Kadapa : ఇండియన్ ఆర్మీలో సేవలందించేందుకు ఎదురు చూస్తున్న యువతకు భారీ అవకాశం రానే వచ్చింది. ఏపీలోని కడప నగరంలోని డీఎస్‌ఏ స్టేడియంలో ఈ నెల (నవంబర్) 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి మొత్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో దశకు ఎంపికైన యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మీ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. లేదంటే అనర్హతకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి సూచనలు పాటించాలి, ఏ ధ్రువపత్రాలు తీసుకురావాలి, రిజిస్ట్రేషన్, భోజన, వసతి తదితర వివరాలపై ప్రత్యేక కథనం.
13 జిల్లాల అభ్యర్థులు : ఈ ర్యాలీలో మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల అభ్యర్థులు పాల్గొంటున్నారు. వైఎస్‌ఆర్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులు హాజరవుతారు.
రోజుకు 800 మందికి స్క్రీనింగ్ టెస్ట్ : ఆర్మీ ర్యాలీకి మొత్తంగా 4 వేల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రోజుకు 8 వందల మంది అభ్యర్థుల చొప్పున స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కాల్ లెటర్‌లో ఇచ్చిన తేదీలో, సూచించిన సమయానికి మాత్రమే హాజరై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏ రోజు కేటాయించిన అభ్యర్థులు ఆ రోజే రావాలి. వేరే టైంలో గానీ, రోజుల్లో గానీ వస్తే అనుమతించరు.
అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలివే
1. అభ్యర్థి వయస్సు ఒకవేళ 18 ఏళ్ల లోపు ఉంటే తండ్రి లేదా తల్లి చేత సమ్మతి పత్రం (పేరెంట్ కాన్సెంట్ సర్టిఫికెట్)
2. అడ్మిట్ కార్డు
3. ఒరిజినల్ ఎడ్యూకేషన్ సర్టిఫికేట్స్ (పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తదితర)
4. స్కూల్ లేదా కళాశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్
5. ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్
6. ఒరిజినల్ నివాస ధ్రువపత్రం
7. ఆధార్ కార్డు, పాన్ కార్డు
8. ఎన్‌సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు (ఉంటే)
9. పాఠశాల నుంచి క్యారెక్టర్ (ప్రవర్తన) ధ్రువపత్రం
10. గ్రామ సర్పంచ్ లేదా మున్సిపల్ అధికారి నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్
11. ఏ విధమైన నేర చరిత్ర, వివాదాలు లేవని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి నాన్ ఇన్‌వాల్వ్‌మెంట్ సర్టిఫికెట్
12. అన్ మ్యారీడ్ సర్టిఫికెట్
13. నోటిఫికేషన్‌లో సూచించినట్లు అఫిడవిట్ పూర్తి చేసి ఉండాలి.
14. తాజాగా తీసుకున్న 20 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు (5x4) (టోపీ, కళ్లజోడు ఉన్న ఫొటోలు అనుమతించరు.)
ఇలా చేరుకోవాలి
- కడప రైల్వే స్టేషన్ నుంచి డీఎస్‌ఏ స్టేడియానికి 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి నుంచి ఆటోలో నేరుగా స్టేడియానికి వెళ్లొచ్చు
- కడప ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండుల నుంచి ఆటోలు ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థులకు భోజనం, వసతి : దూర ప్రాంతాల నుంచి ముందుగా వచ్చే అభ్యర్థులు ఇక్కడ ఏర్పాటు చేసిన గుడారాల్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. దీంతో ర్యాలీలో పాల్గొనేందుకు ఉత్సాహంగా తయారవుతారు. అభ్యర్థులు టెన్షన్‌తో వస్తే అలసటకు గురయ్యే అవకాశముంది. కొందరికి అర్ధరాత్రి నుంచి సమయం కేటాయించారు. అలాంటి వారు ముందు రోజు రాత్రే కడపకు చేరుకోవాల్సి ఉంది. అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు.
రిజిస్ట్రేషన్ ఇక్కడ: అభ్యర్థులు డీఎస్‌ఏ స్టేడియం మెయిన్ గేట్ వద్ద కుడి వైపున ట్యాంకు సమీపంలోని చిన్న మైదానం వద్దకు చేరుకుంటే, అక్కడ రిజిస్ట్రేషన్ కేంద్రంలో ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. తర్వాత ఆర్మీ అధికారుల సూచనల ప్రకారం చేయాలి.
ఇండోర్ స్టేడియంలో వైద్య పరీక్షలు: ఆర్మీ ర్యాలీలో అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇండోర్ స్టేడియంలో మెడికల్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా గాయాలు తగిలినా, అస్వస్థతకు గురైనా ఇక్కడే వైద్య సేవల కోసం శిబిరం ఏర్పాటు చేశారు.
పచ్చబొట్టు ఉంటే అనర్హులే : శరీరంపై శాశ్వతమైన పచ్చబొట్టు ముంజేయి అడుగున, మోచేయి వెనుక అడుగు భాగాన, మణికట్టు ముందు, వెనుక భాగాన మినహాయించి, వేరే ఎక్కడైనా ఉంటే అభ్యర్థిని తదుపరి పరీక్షలకు అనుమతించరు.
గడ్డం ఉంటే అంతే
- అభ్యర్థులు దేహధారుడ్య పరీక్షలకు గడ్డంతో రాకూడదు. నీట్ షేవ్‌తో హాజరవ్వాలి.
- తప్పుడు లేదా నకిలీ ధ్రువపత్రాలను వెంట తీసుకురాకూడదు.
- సెలక్షన్‌కు సంబంధించి వివరాలు, ఏవైనా సందేహాలకు రిక్రూట్‌మెంట్ ఆఫీసు సిబ్బందిని మాత్రమే అడిగి తెలుసుకోవాలి. ఇతరులను అస్సలు సంప్రదించొద్దు.
- ఏమైనా వ్యాధులు, గాయాలుంటే అనుమతించరు.
- ఏజెంట్లను నమ్మి ఎవరైనా డబ్బులిచ్చారని తేలినా, అలాంటి వారిని ర్యాలీకి అనుమతించరు. వెంటనే అనర్హులుగా ప్రకటిస్తారు.
- ర్యాలీ ప్రదేశానికి మొబైల్, ఇతర ఖరీదైన వ్యక్తిగత వస్తువులను తీసుకెళ్లకూడదు.
- ర్యాలీలో పాల్గొనే క్యాండిడేట్స్ తోటి అభ్యర్థులతో, రిక్రూట్‌మెంట్ సిబ్బందితో వివాదాలకు దిగకూడదు.
- ర్యాలీ జరిగే ప్రదేశంలోని ఆస్తులకు నష్టం కలిగించకూడదు.
- ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా, అభ్యర్థులపై చర్యలు తీసుకుంటారు.
కడపలో నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పించాం. అభ్యర్థులు మోసపూరిత ప్రకటనలు, దళారులను నమ్మి మోసపోవద్దు. - పునీత్‌కుమార్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టర్
ఇంటర్ అర్హతతో ఆర్మీలో కొలువులు - బీటెక్ కోర్సుతో పాటు లెఫ్టినెంట్ జాబ్
గేబియాన్ బుట్టల ద్వారా బుడమేరు గండ్లు పూడ్చుతాం : ఆర్మీ - Army Started Work at Budameru Canal