Armoor Mancherial NH63 Highway : ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు నిర్మించనున్న జాతీయ రహదారి మార్గంలో మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి పట్టణాలున్నాయి. జనావాసాలకు ఇబ్బందులు కలగకుండా పలు ప్రాంతాల్లో బైపాస్ రహదారి ప్రతిపాదించారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి భూసేకరణకు అవసరమైన ప్రక్రియ చేపట్టారు. జగిత్యాల జిల్లాలో 69 కిలోమీటర్లు మేర నాలుగు వరసల రహదారి నిర్మించనున్నారు.
నాలుగు లేన్లకు విస్తరణ : ఆర్మూర్ నుంచి మెట్‌పల్లి వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారిని విస్తరించనున్నారు. మెట్‌పల్లి, కోరుట్ల శివారు నుంచి 17 కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి ప్రతిపాదించారు. ఆ తర్వాత 15 కిలోమీటర్లు, అప్పటికే ఉన్న రహదారినే విస్తరిస్తారు. జగిత్యాల నుంచి 11 కిలోమీటర్లు బైపాస్ రహదారి నిర్మించనున్నారు. అక్కడి నుంచి 48.5 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ రహదారి, ఆ తర్వాత 10.44 కిలోమీటర్లు బైపాస్ రహదారి ఏర్పాటు చేయనున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ : ఈ జాతీయ రహదారి 28 గ్రామాల మీదుగా వెళ్తోంది. భూములు కోల్పోతున్న రైతులు, తమకు మార్కెట్ ధర మేరకు పరిహారాన్ని ఏకకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగు వరసల రహదారి ప్రాజెక్టు కోసం జగిత్యాలలో పర్యావరణ ప్రజాభిప్రాయ నిర్వహించనున్నారు. జగిత్యాల గ్రామీణ మండలానికి సంబంధించి ఇప్పటికే అభ్యంతరాలను స్వీకరించారు.
"మా గ్రామం గుండా ఆర్మూర్- మంచిర్యాల జాతీయ రహదారి పోతోంది. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం మా భూములను తీసుకుంది. నేటి కాలంలో భూములు చాలా విలువైనవి. ప్రభుత్వం మాకు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఏకకాలంలో డబ్బులు చెల్లించాలి." - రైతులు
చాలా మంది రైతులు సుముఖంగా ఉన్నప్పటికీ, కొందరు మాత్రం వద్దంటున్నారు. జగిత్యాల మండలం తిప్పన్నపేట, చల్‌గల్, హనుమాజీపేట గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారులు మాత్రం ఎన్హెచ్ఏఐ లెక్కల ప్రకారం పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో వేస్తామని స్పష్టం చేస్తున్నారు. విలువైన భూములు కోల్పోతున్న దృష్ట్యా సాధ్యమైనంత మేర పరిహారం అధికంగా వచ్చే విధంగా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
"రహదారి విస్తరణలో భూమి కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించనున్నారు. అధికారుల ఆదేశాల మేరకు భూములను కోల్పోతున్న రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం". - మధుసూదన్, జగిత్యాల ఆర్డీఓ
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ - త్వరలో టెండర్లు
ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రభుత్వం ముందడగు - త్వరలో త్రైపాక్షిక ఒప్పందం! - TG Regional Ring Road Agreement