ArcelorMittal Steel Plant in Anakapalli : ఉమ్మడి విశాఖ జిల్లా మెడలో మరో మణిహారం చేరనుంది. దేశీయ ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్ జాయింట్ వెంచర్ కంపెనీ రెండు దశల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తోంది. మొదటి దశలో రూ.70,000ల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. రాష్ట్ర చరిత్రలోనే ఇది భారీ పెట్టుబడి అవుతుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.
జగన్ సర్కార్ విధ్వంసక పాలనతో గత ఐదేళ్లలో పెట్టుబడుల కోసం నిరీక్షణే మిగిలింది. రాష్ట్రం వైపు కన్నెత్తి చూసేందుకు పారిశ్రామికవేత్తలు హడలిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో వస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆర్సెలార్ మిట్టల్ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. పరిశ్రమ మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరికి పూర్తి చేసి ఉత్పత్తిలోకి తీసుకురానున్నట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు, అధికారుల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది.
73 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి : స్టీల్ ప్లాంట్‌తో పాటు క్యాప్టివ్ అవసరాల కోసం పోర్టు, రైల్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఇవ్వాలని ఆర్సెలార్ మిట్టల్ సంస్థ కోరింది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్లాంట్ నిర్మాణ సమయంలో మరో 25,000ల మందికి, తర్వాత కార్యకలాపాలు, నిర్వహణ కోసం సుమారు 20,000ల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని సంస్థ ప్రతిపాదించింది. దీంతోపాటు రెండో దశ ప్లాంట్ నిర్మాణ సమయంలో అంతే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది.
అనకాపల్లి బల్క్‌డ్రగ్ పార్కు కోసం ప్రతిపాదించిన 2200 ఎకరాలను మొదటి దశ ప్లాంట్ నిర్మాణానికి వినియోగించుకునే అవకాశం ఉందని, దీనివల్ల భూసేకరణ పనుల జాప్యం లేకుండా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవకాశం ఉందని ఆర్సెలార్ మిట్టల్ పేర్కొంది. టౌన్‌షిప్ అభివృద్ధి కోసం మరో 440 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణానికి మొదటి దశ ప్లాంట్‌కు అనుకుని ఉన్న మరో 3800 ఎకరాలను కేటాయించాలని ప్రతిపాదించింది. ఒకేచోట 20 నుంచి 24 మిలియన్ మెట్రిక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యమున్న ఉక్కు కర్మాగారం దేశంలోనే మొదటిదవుతుందని తెలిపింది. క్యాప్టివ్ అవసరాల కోసం పోర్టు నిర్మాణానికి ప్లాంట్‌కు సమీపంలో 3000ల మీటర్ల పొడవున సముద్ర తీర ప్రాంతాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
ముడి ఖనిజానికి ఢోకా లేదు : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ఎండీసీకి కేటాయించిన గనుల నుంచి ప్లాంట్‌కు అవసరమైన ముడి ఖనిజాన్ని తీసుకోనున్నట్లు సంస్థ తెలిపింది. ఆ సంస్థ దగ్గర ప్రస్తుతం ఏటా 17.5 మిలియన్ టన్నుల ముడి ఖనిజం నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. దీంతోపాటు భవిష్యత్ అవసరాలకు సరిపడా ముడి ఖనిజాన్ని తవ్వేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించిందని వివరించింది. ఛత్తీస్‌గఢ్‌లోని గనుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రసుత్తం 46 మిలియన్ టన్నులుగా ఉంది.
దీన్ని 2029 నాటికి 96 ఎంఎంటీపీఏకు పెంచాలని ఎన్ఎండీసీ లక్ష్యం. గనుల విస్తరణకు రూ.50,000ల కోట్లను సంస్థ ఖర్చు చేయబోతోంది. ఆ సంస్థ ఉత్పత్తి చేసే ముడి ఖనిజాన్ని విశాఖలోని ప్లాంట్ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్స్, ఎన్ఎండీసీ, ఏపీఐఐసీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అందరికీ ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది..
ArcelorMittal Investments in AP : ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో ఏపీలో అంతర్గత ఆస్తుల అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కర్మాగారంలో పనిచేసే ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారితో కలిపి పరిశ్రమకు చుట్టుపక్కల 60,000ల నుంచి 80,000ల మంది నివసించే అవకాశం ఉందని సంస్థ వివరించింది. క్రమేణా జంషెడ్‌పూర్, భిలాయ్, బొకారో, విశాఖపట్నం తరహాలో మరో ఉక్కు నగరం అభివృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడుతుందని సంస్థ ప్రతిపాదనల్లో తెలిపింది. దీంతో పాటు వివిధ అనుబంధ కంపెనీలు, పరిశ్రమకు అనుసంధానంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెట్టే పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఏపీలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు
"పెట్టుబడులు, ప్రోత్సాహకాలు" - రాష్ట్రం రూపురేఖలు మార్చనున్న "ఆరు పాలసీలు"