NMU Leaders Meet CM Chandrababu : గడిచిన ఐదేళ్లుగా తమ ఉద్యోగులు పడుతోన్న కష్టాలను తీర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘం ఎన్‌ఎంయూ నేతలు కోరారు. ఈ మేరకు సీఎంను కలిసి కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో తాము పడిన కష్టాలను చంద్రబాబుకు వివరించి పరిష్కరించాలని కోరారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసినట్లు చెప్పిన గత సర్కార్ తమ సమస్యలు పరిష్కరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులపై పనిష్మెంట్లపై గత టీడీపీ ప్రభుత్వంలో 2019లో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సర్క్యులర్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కనపెట్టిందని ఎన్‌ఎంయూ నేతలు చెప్పారు. పనిష్మెంట్ల పేరిట డ్రైవర్లు, కండక్టర్లను విపరీతంగా వేధిస్తున్నారన్నారని వారు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే గత సర్క్యులర్‌ను పునరుద్ధరించి సిబ్బంది కష్టాలు తీర్చాలని కోరారు. కేడర్ స్ట్రెంత్ పేరుతో ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని, హెచ్ఆర్ఏలో కోత పెట్టారని నేతలు వాపోయారు.
NMU Leaders on RTC Employees Problems : ఏటా 4,000ల కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేట్‌కు ధీటుగా రోడ్డు రవాణా సంస్థను తీర్చిదిద్దాలని నేతలు కోరారు. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ల కొరత కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని, వెంటనే నియామకాలు చేపట్టాలని విన్నవించారు. సంస్థ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. విలీనం అనంతరం తమకు ఉన్న అపరిమిత ఉచిత వైద్యాన్ని గత సర్కార్ తొలగించిందని, దీన్ని పునరుద్ధరించాలని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులకు గత సర్కార్ పెండింగ్‌లో పెట్టిన 2017నాటి వేతన బకాయిలు చెల్లించాలని వివరించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అనంతరం సిబ్బంది అలవెన్సుల్లో కోత వేశారని నేతలు తెలిపారు. ఫలితంగా సిబ్బంది కష్టాలు పడుతున్నారని వివరించారు. అందుకే అలవెన్సులు పునరుద్ధరించాలని కోరారు. సంస్థలో కారుణ్య నియామకాల భర్తీకి చర్యలు సహా పలు సమస్యలను తీసుకోవాలని చంద్రబాబుకు ఎన్‌ఎంయూ నేతలు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎన్‌ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం- కాపలా విధుల్లో బస్ కండక్టర్లు - RTC CONDUCTORS
అవును అవి ఆర్టీసీ బస్సులే!- ప్రయాణమంటేనే భయపడుతున్న ప్రజలు - YSRCP Govt Neglect APSRTC