RTC Chairman Explains to Participation Gouthu Latchanna Program : వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వివరణ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అనుకోకుండా జరిగిందని తెలిపారు. పార్టీ శ్రేణులు అపార్థం చేసుకోవద్దని కోరారు. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడు చేయనని స్పష్టం చేశారు. ఎల్లప్పుడు పార్టీకి విధేయుడిగానే పని చేస్తానన్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. ఈ సంఘటనపై కొనకళ్ల నారాయణ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.
జోగి రమేష్ తో కలిసి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఘటన యాదృచ్ఛికంగా జరిగిందని తెలిపారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ల ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని తెలిపారు. జోగి రమేష్ వస్తున్నాడన్న సమాచారం తనకు ఏ మాత్రం లేదన్నారు. తాను అక్కడకు వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చాడని, గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయకూడదన్న ఉద్దేశంతోనే జోగి రమేష్ వచ్చినా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని కొనకళ్ల తెలిపారు.
'ఇలా జరుగుతుందని మాకు తెలియదు' - క్షమాపణలు చెప్పిన మంత్రి, ఎమ్మెల్యే
దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి అన్ని విషయాలు వివరిస్తానన్నారు. రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిని కాపాడాల్సిన అవసరం కూటమి నేతలకు లేదని వ్యాఖ్యానించారు. పేర్ని నాని చేసిన తప్పుకు శిక్ష అనుభవించకతప్పదని తేల్చిచెప్పారు. పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అధికారాన్ని ఉపయోగించుకొని దోచుకుతిన్న వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. పక్కదారి పట్టించిన బియ్యానికి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు నుంచి బయడపడలేరని కొనకళ్ల నారాయణ తేల్చిచెప్పారు.
అయితే ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం రోజు జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొని వైఎ్సస్సార్సీపీ నేతలతో అత్యంత సన్నిహితంగా మెలగడం, ఒకే వాహనంపై పట్టణంలో ఊరేగడం పట్ల తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్న విషయం తెలిసిందే.
టీడీపీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ - రంగంలోకి టెక్నికల్ వింగ్
ఈ సంఘటన తరువాత పార్టీలో తీవ్ర ప్రకంపనలే సృష్టించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాలను హోరెత్తించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వచ్చిన వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌తో మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అత్యంత సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వేదిక పంచుకోవడంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.
ఆ ముగ్గురు నేతల తీరు అభిమానుల గుండెల మీద తన్నినట్లుంది: బుద్దా వెంకన్న