Admission to Paramedical Courses : వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించటంలో డాక్టర్లు కీలకంగా వ్యవహరిస్తారు. బయటకు కనిపించేది వీరే అయినప్పటికీ తెర వెనక నుంచి వైద్య నిపుణులకు సాయమందించే వారు చాలామందే ఉంటారు. ఈ విభాగంలో పారా మెడిక్‌లు (వైద్య అనుబంధ నిపుణులు) అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పారా మెడికల్ కోర్సుల శిక్షణకు ఖమ్మం, కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వేదిక కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి ఈ రెండు కళాశాలల్లో 60 చొప్పున పారా మెడికల్ సీట్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ పారా మెడికల్ బోర్డు (టీజీపీఎంబీ) ఆదేశించింది.
ఒక్కో కాలేజీలో రెండేసి కోర్సులు : పారా మెడికల్ విభాగంలో మొత్తం 21 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొత్తగూడెం మెడికల్ కళాశాలకు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (డీఎల్‌ఎంటీ), డిప్లొమా ఇన్ డయాలసిస్, ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ (డీఎంఐటీ), డిప్లొమా ఇన్ ఆనస్తీషియా టెక్నాలజీ (డీఏఎన్‌ఎస్) కోర్సులను కేటాయించారు. ఒక్కో కోర్సులో 30 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు.
వైద్య సేవల్లో పారా మెడిక్‌ల పాత్ర
- రోగులను పరీక్షించటం, వ్యాధి నిర్ధారణ
- ప్రత్యేకమైన సమయాల్లో అత్యవసర చికిత్సలందించటం
- వెంటిలేటర్లు, డెఫిబ్రిలేటర్లు లాంటి వైద్య పరికరాల నిర్వహణ
- రోగుల ఆరోగ్య సమాచారం అందించడం
- ప్రాథమిక చికిత్స అంశాలను నేర్పించటం
తీరనున్న సిబ్బంది కొరత : ఖమ్మం, కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు పారా మెడికల్ సీట్లు కేటాయించటంతో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని పలువురు వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల వ్యవధి గల ఈ కోర్సుల్లో ఏడాది పాటు తరగతి గదిలో పాఠాలు నేర్చుకోగా, మరో ఏడాది వైద్యులకు సహకరిస్తూ విద్యనభ్యసిస్తారు. దీనివల్ల హాస్పిటల్స్‌లో సిబ్బంది కొరత తీరనుంది. ఏటా వైద్య కళాశాల పరిధిలోని స్థానిక యువతకే పారా మెడికల్ సీట్లను కేటాయిస్తారు. చదువు పూర్తయిన అనంతరం వీరు ఈ రంగంలోని గవర్నమెంట్ జాబ్స్ కోసం పోటీపడొచ్చు. లేదా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఉపాధిని పొందవచ్చు.
అప్పటి నుంచే తరగతులు ప్రారంభం : పారా మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ (ప్రకటన) ఈ నెల 21న వెలువడింది. ఈ నెల 30 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. కోర్సులకు ఎంపికైన వారి వివరాలను నవంబర్ 13న అధికారులు వెల్లడించనున్నారు. ఎంపికైన వారి జాబితాపై టీజీపీఎంబీ నవంబర్ 22న తుది ప్రకటన చేయనుంది. సీట్లు పొందిన విద్యార్థులకు నవంబర్ 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఖమ్మం, కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్ డా.రాజేశ్వరరావు, డా.రాజ్‌కుమార్ తెలిపారు.
ఏ విధంగా ఎంపిక చేస్తారంటే? : రెండేళ్ల కాలపరిమితి గల పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌లో బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. బైపీసీ విద్యార్థులు లేకుంటే ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యమిస్తారు. ఈ రెండు గ్రూప్‌ల వారు లేకుంటే ఇతర గ్రూప్‌లకు చెందిన వారికి ప్రవేశం కల్పించే అవకాశముంటుంది. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్ల మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.
'దాతలు స్పందిస్తే తొలి డాక్టర్ అవుతా - కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్'
రైల్వేలో 1376 పారా మెడికల్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!